నారా రోహిత్ ఇలా అయిపోయాడేంటి?

రాజ‌కీయాల‌కు పేరుప‌డ్డ నారా వారి ఫ్యామిలీ నుంచి సినీ రంంలోకి అడుగు పెట్టి.. ఒక‌ప్పుడు విరామం లేకుండా సినిమాలు చేసిన న‌టుడు నారా రోహిత్. బాణం లాంటి మంచి సినిమాతో క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌యం అయిన అత‌ను.. దీంతో పాటు ఇంకొన్ని వైవిధ్య‌మైన సినిమాల‌తో బాగానే ఆక‌ట్టుకున్నాడు.

ఒక టైంలో ప్రామిసింగ్ యంగ్ హీరోల్లో ఒక‌డిగా ఉన్నాడు. కానీ వ‌రుస ప‌రాజ‌యాలు ఎలాంటి హీరోకైనా కిందికి దించేస్తాయ‌న‌డానికి రోహిత్ కూడా ఒక ఉదాహ‌ర‌ణ‌గా మారాడు. అత‌డి చివ‌రి సినిమా వీర భోగ వ‌సంత‌రాయ‌లు రిలీజై దాదాపు మూడున్న‌రేళ్లు కావ‌స్తోంది. ఆ త‌ర్వాత రోహిత్ ఆ సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా చేస్తున్నాడు అని వార్త‌లే త‌ప్ప ఏదీ ప‌ట్టాలెక్క‌లేదు. రోహిత్ అండ‌తో హీరో అయిన శ్రీవిష్ణు బిజీ హీరోల్లో ఒక‌డైపోతే.. రోహిత్ మాత్రం క‌నిపించ‌కుండా పోయాడు.

ఆ మ‌ధ్య కండ‌లు పెంచి ఫిట్‌గా త‌యారై ఏదో సినిమా కోసం రెడీ అవుతున్న‌ట్లుగా క‌నిపించాడు రోహిత్. రీఎంట్రీకి రంగం సిద్ధ‌మైన‌ట్లే అనుకున్నారంతా. కానీ త‌ర్వాత మ‌ళ్లీ క‌నిపించ‌ని రోహిత్.. ఇప్పుడు షాకింగ్ లుక్‌తో అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేశాడు. హైద‌రాబాద్‌లో తాజాగా ఒక ఇన్ ఫ్రాం సంస్థ ప్రారంభోత్స‌వానికి రోహిత్ హాజ‌ర‌య్యాడు.

అత‌డి మిత్రుడు శ్రీ విష్ణు కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నాడు. భారీగా జ‌ట్టు, గ‌డ్డం పెంచి, మ‌ళ్లీ లావై.. పూర్తిగా మెయింటైనెన్స్ గురించి ప‌ట్టించుకోని వాడిలా క‌నిపించాడు రోహిత్. ఇది ఏదో సినిమా కోసం మార్చిన లుక్ లాగా అనిపించ‌ట్లేదు. సినిమాల సంగ‌తి వ‌దిలేసి మామూలు జీవితానికి అల‌వాటు ప‌డిపోయిన వ్య‌క్తిగా సాధార‌ణంగా ద‌ర్శ‌న‌మిచ్చాడు రోహిత్. ఈ లుక్ చూస్తే రోహిత్ మ‌ళ్లీ తెర‌పై క‌నిపించ‌డం అనుమానంగానే ఉంది. మ‌రి అత‌డి ఆలోచ‌న ఏమిటో?