పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏం చేసినా విమర్శించడానికి ఒక బ్యాచ్ సిద్ధంగా ఉంటుంది. గత ఏడాది ఆంధ్రప్రదేశ్ సర్కారు ఎన్నడూ లేని విధంగా టికెట్ల రేట్లు తగ్గించి ఫిలిం ఇండస్ట్రీని సంక్షోభంలోకి నెట్టడంపై పవన్ ధైర్యంగా ప్రశ్నించడం కూడా తప్పయిపోయింది. ఉన్నట్లుండి ‘వకీల్ సాబ్’ సినిమా నుంచే టికెట్ల ధరల నియంత్రణ మొదలవడంతో పవన్‌ను టార్గెట్ చేయడంలో భాగంగానే అలా చేశారన్నది స్పష్టం.
తర్వాత ఈ సమస్య మరింత పెద్దదై ఇండస్ట్రీ మొత్తాన్ని ఇబ్బంది పెట్టింది. ఐతే మధ్యలో ‘రిపబ్లిక్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా పవన్.. టికెట్ల ధరల విషయంలో జగన్ సర్కారు తీరును తీవ్ర స్థాయిలో దుయ్యబట్టాడు. ఐతే పవన్ ఇలా గొంతెత్తడం వల్ల సమస్య మరింత తీవ్రమైందని, జగన్ సర్కారు ఇగోకు పోయి టికెట్ల ధరల విషయంలో మరింత పట్టుదలకు పోయిందని కొందరు సూత్రీకరించారు.
అది నిజమే కావచ్చు కానీ.. ప్రభుత్వానికి భయపడి అసలు నోరెత్తకుండా ఉండటం ఎంత వరకు కరెక్ట్ అన్నది ప్రశ్న.ఇప్పుడు పవన్ కొత్త చిత్రం ‘భీమ్లా నాయక్’ను ఎలా ఇబ్బంది పెడదామా అని జగన్ సర్కారు చూస్తుంటుందనడంలో సందేహం లేదు. నిజానికి కొత్త టికెట్ల రేట్ల జీవోను ఈపాటికే ఇవ్వాల్సి ఉన్నా ‘భీమ్లా..’కు ప్రయోజనం దక్కకూడదన్న ఉద్దేశంతోనే దాన్ని ఆలస్యం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక రిలీజ్ టైంలో ఏం చేస్తారో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇలాంటి టైంలో జనసేనాని నరసాపురంలో మత్స్యకార అభ్యున్నతి సభకు వచ్చి.. మత్య్సకారుల ప్రయోజనాలను దెబ్బ తీసేలా జారీ చేసిన జీవో నంబర్ 217ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ తీవ్ర స్థాయిలోనే జగన్ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.
ఐతే టికెట్ల రేట్లపై జీవో నేడో రేపో అంటుండగా.. పవన్ ఇలా మీటింగ్ పెట్టి జగన్ సర్కారును తిట్టి వాళ్లను రెచ్చగొట్టడం ఏంటి అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఐతే పవన్ ఈ టైంలో సైలెంటుగా ఉంటే.. తన సినిమాను కాపాడుకోవడానికి తగ్గి ఉంటుండాని అనేవారు. ఇప్పుడు పవన్ గళం విప్పితే తన సినిమాపై ఆధారపడ్డ వాళ్లను, అలాగే ఇండస్ట్రీలో మిగతా వాళ్లను ఇబ్బంది పెడుతున్నాడని విమర్శిస్తున్నారు. కాబట్టి పవన్ ఏం చేసినా విమర్శించడం మాత్రం పక్కా. తన సినిమా రిలీజ్ పెట్టుకుని కూడా ఇలా ధైర్యంగా మాట్లాడినందుకు పవన్ గట్స్‌కు మెచ్చుకోవాల్సిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates