బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్.. మోడీ వర్సెస్ కేసీఆర్.. ఇప్పుడు రాజకీయాల్లో మారిన పరిణామాల నేపథ్యంలో వినిపిస్తున్న మాటలవి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై టీఆర్ఎస్ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పోరు బావుటా ఎగరేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంపై మోడీ ప్రభుత్వం వివక్ష చూపుతుందని అన్యాయం చేస్తుందని కేసీఆర్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సంచలన వ్యాఖ్యలతో మోడీని టార్గెట్ చేస్తున్నారు. మోడీని దేశం నుంచి తరిమివేయాలని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు హాట్‌హాట్‌గా మారాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనూ బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ పోరు ఎక్కువైంది.
ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటనకు కేసీఆర్ వెళ్లకపోవడంతో ఈ రెండు పార్టీల మధ్య రణం మరింత తీవ్రమైంది. రెండు పార్టీల నేతలు పరస్సరం తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో అనుచిత వ్యాఖ్యలు చేసే బీజేపీ నేతల వీపులు పగలగొట్టాలనేలా కేసీఆర్ తనయుడు ఐటీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే జనగామ, ఆర్మూర్‌లో టీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ల వీపులు పగలగొట్టారని సిరిసిల్లాలోనూ అదే చేయాలని రెచ్చగొట్టేలా కేసీఆర్ పేర్కొన్నారు.
ఆర్మూర్‌లో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై దాడి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు టీఆర్ఎస్ శ్రేణులే కారణమంటూ అరవింద్ ఫిర్యాదు కూడా చేశారు. దీనిపై గవర్నర్ తమిళిసై కూడా ఆరా తీశారు. ఈ నేపథ్యంలో తాజాగా కేటీఆర్ వ్యాఖ్యలతో టీఆర్ఎస్ కార్యకర్తలు మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏం జరిగినా తాము చూసుకుంటామని కేటీఆర్ భరోసా ఇవ్వడంతో సిరిసిల్లాలో బీజేపీ నాయకులను దీటుగా ఎదుర్కొనేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య వైరం మరింత ముదరనుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates