ఆంధ్రప్రదేశ్లో టికెట్ల రేట్ల విషయమై గత పది నెలలుగా ఎంత చర్చ నడుస్తోందో తెలిసిందే. తెలుగు ఇండస్ట్రీలో సంక్షోభంలోకి నెట్టేలా కనిపించిన ఈ సమస్య పరిష్కారం కోసం చిరంజీవి సహా కొందరు ప్రముఖులు గట్టిగా ప్రయత్నించారు. ఐతే ఆయన ఇండస్ట్రీ పెద్దగా లీడ్ తీసుకోవడంపై కొందరి నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
ఈ సమయంలోనే కాక.. ఇంతకుముందు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాధినేతలతో వివిధ సమస్యలపై చర్చించేందుకు వెళ్లినపుడు ఆయన అందరినీ కలుపుకుని వెళ్లడం లేదని కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఇండస్ట్రీ దిగ్గజాల్లో ఒకడైన బాలయ్యను ఈ సమావేశాలకు పిలవకపోవడాన్ని తప్పుబట్టారు. బాలయ్యే స్వయంగా ఈ విషయంలో అసహనం వ్యక్తం చేశారు. దానిపై ఒక వివాదాస్పద కామెంట్ కూడా చేశారు. దాని మీద కొంత దుమారం రేగింది కూడా.
ఆ సంగతలా ఉంచితే.. ఇటీవల చిరు నేతృత్వంలో కొందరు ప్రముఖులు ఏపీ సీఎం జగన్ను కలవడం తెలిసిందే. మరి ఈ సమావేశానికి బాలయ్యను పిలిచారా లేదా అనే విషయంలో కొంత చర్చ నడిచింది. ఈ నేపథ్యంలో తమ బసవతారకం ఆసుపత్రికి సంబంధించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న బాలయ్యనే విలేకరులు దీని గురించి ప్రశ్నించారు. ఇందుకాయన బదులిస్తూ.. తనను ఈ సమావేశానికి చిరు బృందం పిలిచినట్లు వెల్లడించారు.
కానీ తాను ఈ మీటింగ్కు రానని చెప్పేసినట్లు ఆయన వెల్లడించారు. ఇప్పుడే కాదు.. ఇక ముందూ తాను జగన్ను కలవనని తేల్చి చెప్పారు బాలయ్య. బడ్జెట్లు ఎక్కువైతే టికెట్ల రేట్ల విషయంలో సమస్య ఉంటుందని.. తాను తన సినిమాలకు బడ్జెట్ పెరగనివ్వనని.. కాబట్టి టికెట్ల రేట్లు తక్కువ ఉన్నా తనకు సమస్య లేదని బాలయ్య అన్నారు. తక్కువ టికెట్ల రేట్లతోనే ‘అఖండ’ సినిమా ఘనవిజయం సాధించిందని.. ఇంతకుమించిన ఉదాహరణ ఏం కావాలని బాలయ్య అన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates