నేనిలా ఉన్నానంటే చక్రి వల్లే-తమన్

తెలుగు సినిమా సంగీత చరిత్రలో దివంగత మ్యూజిక్ డైరెక్టర్ చక్రిది ఒక ప్రత్యేక అధ్యాయం. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, గోపి గోపిక గోదావరి.. ఇలా ఎన్నో అద్భుతమైన ఆల్బమ్స్‌తో ఒక టైంలో టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఒక వెలుగు వెలిగాడు చక్రి. ఇళయరాజా శైలిలో అతను అందించిన మెలోడీలు ఇప్పటికే సంగీత ప్రియులను అలరిస్తూనే ఉంటాయి.

ఇప్పుడు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లుగా ఉన్న చాలామంది చక్రి దగ్గర పని చేసిన వారే. అందులో తమన్ కూడా ఒకడు. చక్రి దగ్గర చాలా సినిమాలకు కీబోర్డ్ ప్లేయర్‌గా పనిచేశాడు తమన్. చక్రి తమ్ముడు మహిత్ తన అన్నయ్య పేరుతో ఒక మ్యూజిక్ స్టూడియో ఆరంభించగా.. దాన్ని తమనే ఆవిష్కరించాడు. ఈ సందర్భంగా చక్రితో తనుకున్న అనుబంధం గురించి తమన్ గుర్తు చేసుకున్నాడు.తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉండటానికి చక్రినే కారణమని ఉద్వేగంతో చెప్పాడు తమన్.

‘బాచి’ దగ్గర్నుంచి చక్రి సినిమాలు ఎన్నింటికో తాను కీబోర్డ్ ప్లేయర్‌గా పని చేశానన్నాడు. తనతో పాటు హ్యారిస్ జైరాజ్ లాంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ చక్రి దగ్గర చాలా సినిమాలకు పని చేసినట్లు తమన్ వెల్లడించాడు. చక్రి తమను ఎంతో బాగా చూసుకునేవాడని.. ఖాళీ సమయాల్లో తామే ఫోన్ చేసి పని ఉందా అని అడిగి మరీ చెన్నై నుంచి చక్రి దగ్గరికి వచ్చి ఆయన సినిమాలకు పని చేసేవారమని తమన్ వెల్లడించాడు.

చక్రి వ్యక్తిగతంగా కూడా చాలా మంచివాడని.. మ్యుజీషియన్స్ అందరినీ ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టించేవాడని.. చక్రి తనకు మరింత క్లోజ్ అని.. తామిద్దరం బైక్ వేసుకుని హైదరాబాద్ అంతా రౌండ్లు కొట్టేవాళ్లమని తమన్ వెల్లడించాడు. చక్రి లాంటి సంగీత దర్శకులు ప్రపంచంలో చాలా తక్కువమంది ఉంటారని.. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ మహిత్ స్టూడియో మొదలుపెట్టడం సంతోషమని.. దీన్ని తన చేతుల మీదుగా మొదలుపెట్టడం తన అదృష్టమని తమన్ వ్యాఖ్యానించాడు.