కొత్త హీరోయిన్ కోసం త్రివిక్రమ్ మార్పులు!

ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్లు అయిపోయిన వారు చాలా మంది ఉన్నారు. ఈ మధ్యకాలంలో చూసుకుంటే కృతిశెట్టిని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ‘ఉప్పెన’ సినిమా విడుదలైన తరువాత ఈ బ్యూటీకి స్టార్ ఇమేజ్ వచ్చేసింది. వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా మారింది. యంగ్ హీరోలంతా కృతిని హీరోయిన్ గా తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. కృతిశెట్టి తరువాత ఆ రేంజ్ లో అవకాశాలు అందుకుంటున్న మరో యంగ్ హీరోయిన్ శ్రీలీల అని చెప్పొచ్చు. ‘పెళ్లి సందడి’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. 

ఇదేమీ పెద్ద హిట్టు సినిమా కాదు కానీ శ్రీలీల స్క్రీన్ ప్రెజన్స్ కి, డాన్స్ లకు మంచి మార్కులు పడ్డాయి. యూత్ ఆమెకి బాగా కనెక్ట్ అయింది. దీంతో చాలా మంది థియేటర్లో సినిమా చూడడానికి ఆసక్తి చూపారు. ఆ విధంగా సినిమా లాభాలతో బయటపడింది. ఈ సినిమా తరువాత నుంచి శ్రీలీలకి అవకాశాలు పెరిగాయి. రవితేజ, బాలకృష్ణ, మహేష్ బాబు లాంటి హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. 

యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి ఓ సినిమా చేస్తోంది. రీసెంట్ గా రవితేజ ‘ధమాకా’ సినిమాలో ఆమె లుక్ ను రివీల్ చేశారు. మహేష్ బాబు-త్రివిక్రమ్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా శ్రీలీలకి ఛాన్స్ వచ్చింది. ఇందులో ఆమెని హీరోయిన్ పూజాహెగ్డే చెల్లెలిగా తీసుకున్నారు. నిజానికి సినిమాలో శ్రీలీల క్యారెక్టర్ స్పాన్ చాలా తక్కువ. ఆమె రోల్ కి ఒక్క పాట కూడా లేదు. 

దీంతో ఎంత మహేష్ బాబు సినిమా అయినా.. ఓకే చెప్పడానికి కాస్త ఆలోచించింది శ్రీలీల. ఈ విషయం తెలుసుకున్న త్రివిక్రమ్ ఆమె రోల్ ని పెంచాడట. మహేష్ బాబుతో ఓ పాటకు ఛాన్స్ కూడా ఇచ్చారట. సీన్లు కూడా పెరిగినట్లు తెలుస్తోంది. దీంతో సినిమాలో ఆమె పాత్రకి స్పేస్ బాగానే దొరికిందట. స్క్రీన్ టైం తక్కువే అయినప్పటికీ.. కనిపించినంతసేపు శ్రీలీల తన మార్క్ చూపించబోతుందని అంటున్నారు.