టికెట్ల రేట్ల పెంపు.. ఈ మెలికతో ఇబ్బందే

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల గొడవ ఎట్టకేలకు సద్దుమణిగినట్లే సంకేతాలు కనిపిస్తున్నాయి. గత ఏడాది జగన్ సర్కారే ఈ సమస్యను సృష్టించి.. ఆ తర్వాత దీన్ని పెద్దది చేసి.. చివరికి ఇప్పుడు తనే పరిష్కరించి సినీ ప్రముఖులతో జేజేలు కొట్టించుకుంటోంది. ఇన్నాళ్లూ పేదల కోసం టికెట్ల రేట్లు తగ్గించామని చెబుతూ వచ్చిన ప్రభుత్వ పెద్దలు, నాయకులు, మద్దతుదారులు.. ఇప్పుడు రేట్లు పెంచాక ఏం మాట్లాడతారన్నది ఆసక్తికరంగా మారింది.

ఇదిలా ఉంటే మామూలుగా రేట్లు పెంచడంతో పాటు పెద్ద బడ్జెట్ సినిమాలకు, పాన్ ఇండియా చిత్రాలకు స్పెషల్ టికెట్ రేట్లు పెడతామంటూ ప్రభుత్వం ఒక ప్రతిపాదన తేవడం సినీ జనాలకు సంతోషాన్ని తెచ్చింది. దీని గురించి ముందుగా ఇండస్ట్రీ జనాలు ఆహా ఓహో అనేశారు. కానీ తర్వాత ఆ విషయంలో పెట్టిన మెలిక చూసి అవాక్కయ్యారు.

దీని వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని తేల్చేశారు.ఈ స్పెషల్ టికెట్ల రేట్ల విషయంలో ముందు బయటికి వచ్చిన సమాచారం ఏంటంటే.. వంద కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్ ఉన్న సినిమాలకు ఎక్కువ రేట్లతో సినిమా టికెట్లు ఉంటాయని. కానీ అసలు విషయం ఏంటంటే.. ఈ వంద కోట్ల బడ్జెట్లో హీరో, హీరోయిన్, డైరెక్టర్ పారితోషకాలు కలపరట. అవి మినహాయించగా బడ్జెట్ రూ.100 కోట్లు, అంతకంటే ఎక్కువ ఉంటేనే టికెట్ల రేట్లు పెంచుతారట. ఇలా అయితే రాజమౌళి సినిమాలు, ఇంకా ఒకటీ అరా తప్ప ఈ కేటగిరిలోకి రావు. ఇప్పుడు పెద్ద హీరోల సినిమాలన్నీ వంద కోట్లకంటే ఎక్కువ బడ్జెట్లోనే తెరకెక్కుతున్నాయి.

కానీ అందులో 50-60 శాతం.. అంతకంటే ఎక్కువ హీరో హీరోయిన్లు, డైరెక్టర్ పారితోషకాలకే పోతోంది. అవి తీసేస్తే బడ్జెట్ రూ.50 కోట్లయితే ఎక్కువ అన్నట్లుంది. రాజమౌళి, ప్రభాస్ సినిమాలకు మినహా ఈ పారితోషకాలు కాకుండా వంద కోట్ల బడ్జెట్ పెట్టడం కష్టం. అలాంటపుడు ఈ టికెట్ల రేట్ల పెంపు వెసులుబాటు వల్ల ప్రయోజనం పెద్దగా ఏమీ ఉండదన్నట్లే. అయినా సినిమాల బడ్జెట్ల విషయంలో సరైన లెక్కలు ఇండస్ట్రీ జనాలు ఇస్తారా.. వాటిని ప్రభుత్వం వైపు నుంచి ఎవరు మదింపు చేస్తారన్న ప్రశ్నలు కూడా ఉన్నాయి.