ఛాన్సుల్లేక రైటర్ అయిన హీరో

సిద్ధుసిద్ధు జొన్నలగడ్డ.. ఈ మధ్య టాలీవుడ్లో బాగా చర్చనీయాంశం అవుతున్న పేరు. ఇప్పటికే ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ సినిమాతో అతను ఆశ్చర్యపరిచాడు. ఆ సినిమాలో అతడి నటనే కాదు.. రచనా ప్రతిభ కూడా అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘డీజే టిల్లు’ సినిమాకు సైతం అతను రచనా సహకారం అందించాడు. ఒక యంగ్ హీరోలో ఇలాంటి ప్రతిభ ఉండటం అందరికీ ఆశ్చర్యం కలిగించేదే. యూత్‌కు బాగా కనెక్టయ్యేలా అతను కథలు, మాటలు రాస్తుండటం విశేషం.

ఐతే ఈ రచనా పటిమ ఎక్కడి నుంచి వచ్చింది.. మీ సినిమాలన్నింటికీ మీరే రచన బాధ్యతలు తీసుకుంటారా అని మీడియా వాళ్లు అడిగితే.. తాను విధి లేని పరిస్థితుల్లో రచయితగా మారినట్లు సిద్ధు వెల్లడించాడు. ‘డీజే టిల్లు’ శనివారం విడుదలవుతున్న నేపథ్యంలో మీడియాను కలిసిన సిద్ధు.. రచయితగా తన ప్రయాణం గురించి వివరించాడు.‘‘నేను స్వతహాగా రచయితను కాదు. కెరీర్లో ఒక దశలో అవకాశాలు రాక, ఏమి చేయాలో తెలియక నా కథలు నేనే రాసుకుంటే బెటరేమో అన్న ఆలోచన వచ్చి రచయితగా మారాను.

అదృష్టవశాత్తూ నా రైటింగ్ క్లిక్ అయింది. ఐతే నా ప్రతి సినిమాకూ నేనే రాసుకోవాలనేమీ లేదు. ప్రస్తుతం నేను చేస్తున్న వేరే సినిమాలకు వేరే రచయితలే కథలు, మాటలు రాశారు. ఎప్పుడైనా నన్ను కదిలించే ఆలోచన వస్తే మాత్రం కచ్చితంగా పేపర్ మీద పెడతా’’ అని సిద్ధు వెల్లడించాడు. ఇక తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి సిద్ధు వివరిస్తూ.. ప్రస్తుతం ‘డీజే టిల్లు’ చేసిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్లోనే మలయాళ మూవీ ‘కప్పెల’ రీమేక్‌లో నటిస్తున్నానని.. ఇంకో మూడు సినిమాలు లైన్లో ఉన్నాయని.. త్వరలోనే వాటి వివరాలు వెల్లడిస్తానని చెప్పాడు సిద్ధు.

తన కుటుంబ నేపథ్యం గురించి చెబుతూ.. తల్లి ఆలిండియా రేడియోలో, తండ్రి బీఎస్ఎన్‌ల్‌లోనూ పని చేసేవారని.. తాను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే అని.. బీటెక్ అయ్యాక సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వస్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక దగ్గర కూర్చుని పని చేయడం ఇష్టం లేక అది వదులుకుని సినిమాల్లోకి వచ్చినట్లు సిద్ధు తెలిపాడు.