నిన్నటితరం సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా, ఈ తరం సూపర్ స్టార్ మహేష్ బాబు బావగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సుధీర్ బాబు.. హీరోగా అరంగేట్రం చేశాక కొన్నేళ్లు చాలా విమర్శలే ఎదుర్కొన్నాడు. అతడి నటన, డైలాగ్ డెలివరీ విషయంలో చాలా ట్రోలింగ్ జరిగింది. కెరీర్ ఆరంభంలో సరైన విజయాలు కూడా అందుకోలేదు. అతను హీరోగా నిలదొక్కుకోవడం కష్టమే అనుకున్నారు.
కానీ కష్టపడి నటన సహా అన్ని విషయాల్లో మెరుగుపడ్డాడు. ప్రేమకథా చిత్రమ్, కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ, సమ్మోహనం, నన్ను దోచుకుందువటే లాంటి చిత్రాలతో ప్రేక్షకుల మెప్పు పొందాడు. ఐతే కెరీర్ ఆరంభంలో తనపై వచ్చిన విమర్శల గురించి తనకు తెలుసని.. అందులోనూ ఒక సినిమా షూటింగ్ సందర్భంగా కెమెరామన్ అన్న మాటలు తనను బాధించాయని సుధీర్ బాబు తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
తన తొలి సినిమా సమయంలో దాని కెమెరామన్ తన అసిస్టెంట్లతో మాట్లాడుతూ.. తనది ఫొటోజెనిక్ ఫేస్ కాదు.. ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేడు.. అన్న విషయం తన దృష్టికి వచ్చిందని.. ఆ మాటలు విని తాను ముందు చాలా బాధగా అనిపించినప్పటికీ.. ఆ మాటలే తర్వాత నేనేం చేయాలో ఆలోచించుకునేలా చేశాయని.. ఆ వ్యక్తికి తనపై ఉన్న నెగెటివ్ ఇంప్రెషన్ నటుడిగా తనను తాను నిరూపించుకోవడానికి ఉపయోగపడిందని సుధీర్ చెప్పాడు.
ప్రేమకథా చిత్రమ్ చూశాక ఇక తాను వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదని మహేష్ చెప్పాడని.. ఆ మాటలు తనపై తనకెంతో నమ్మకాన్నిచ్చాయని చెప్పాడు సుధీర్. తొమ్మిదేళ్ల తన ప్రయాణంలో ఇప్పటిదాకా తనకీ సినిమా చేసిపెట్టమని మహేష్‌ను కానీ, కృష్ణను కానీ ఫేవర్ అడగలేదని.. దర్శక నిర్మాతలతో పాటు ప్రేక్షకులు తన నటన నచ్చి తనను గౌరవిస్తున్నారని భావిస్తున్నట్లు సుధీర్ తెలిపాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates