గత కొన్ని నెలల నుంచి కాజల్ అగర్వాల్ ప్రెగ్నెన్సీ గురించి ఎంత చర్చ నడుస్తోందో తెలిసిందే. ముందుగా ఆమె ప్రెగ్నెంట్ అనే విషయంలో ఊహాగానాలు నడిచాయి. ఇదెంత వరకు నిజమో తెలియక అభిమానులు అయోమయానికి గురయ్యారు. ఐతే సూటిగా ఈ విషయం చెప్పకపోయినా ఈ మధ్య కాజల్ షేర్ చేస్తున్న ఫొటోల ద్వారా ఆ విషయాన్ని చెప్పకనే చెప్పినట్లయింది. ఐతే గర్భం ధరించడం వల్ల ఈ ఫొటోల్లో కాజల్ ముఖంలో, శరీరంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
దీనిపై నెగెటివ్ కామెంట్లు కూడా ఎక్కువైపోయాయి. ఎలా ఉండే కాజల్ ఎలా అయిపోయిందో అంటూ కౌంటర్లు వేస్తున్నారు నెటిజన్లు. ఐతే ఈ కామెంట్లపై కొంత కాలం మౌనం వహించిన చందమామ.. ఇప్పుడు ట్రోలర్స్‌కు గట్టి సమాధానం చెబుతూ సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టింది.
తల్లి కావడం అన్నది ఒక మహిళ జీవితంలో అద్భుతమైన అనుభవమని.. ఈ క్రమంలో శరీరంలో మార్పులు సహజమని.. అవి బిడ్డ మంచి కోసమే జరుగుతాయని.. అందుకు ఎంతమాత్రం బాధ పడాల్సిన పని లేదని కాజల్ వ్యాఖ్యానించింది. కొందరు మూర్ఖులు ఇలాంటి సమయంలో బాడీ షేమింగ్ కామెంట్లు చేస్తుంటారని.. ఇలాంటివి అస్సలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని కాజల్ వ్యాఖ్యానించింది.
మాతృత్వ సమయంలో ఒంట్లో అవయవాల బరువు పెరగడం.. ముఖంలో మార్పు రావడం.. పొట్టపై గీతలు పడటం.. ఇలా ఎన్నో మార్పులు జరుగుతాయని.. డెలివరీ తర్వాత పూర్వపు స్థితికి రావడానికి సమయం పట్టొచ్చని.. కొన్నిసార్లు ఒకప్పటి రూపానికి రావడం కూడా ఎప్పటికీ జరగకపోవచ్చని.. అయినా ఇందుకు మానసికంగా సిద్ధంగా ఉండాల్సిందే అని.. ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచించకూడదని కాజల్ వ్యాఖ్యానించింది. గర్భం ధరించే మహిళలకు కాజల్ కొన్ని సూచనలు కూడా చేస్తూ ఇంకో పోస్టు కూడా పెట్టింది.