దేవిశ్రీ.. అర‌గంట‌లో ఆరు పాట‌లు

గ‌త రెండు ద‌శాబ్దాల్లో తెలుగు సినిమాల్లో తిరుగులేని ఆధిప‌త్యం చ‌లాయించిన సంగీత ద‌ర్శ‌కుల్లో దేవిశ్రీ ప్ర‌సాద్ ఒక‌డు. మ‌ణిశ‌ర్మ హ‌వా త‌గ్గాక ఒక ప‌దేళ్లు అత‌నే తెలుగులో నంబ‌ర్ వ‌న్ మ్యూజిక్ డైరెక్ట‌ర్. తెలుగులో దాదాపుగా అంద‌రు టాప్ స్టార్ల‌తోనూ అత‌ను సినిమాలు చేశాడు. త‌మిళంలోనూ పెద్ద హీరోలు చాలామందితో ప‌ని చేశాడు. ఐతే గ‌త మూణ్నాలుగేళ్ల‌లో అత‌డి జోరు కొంచెం త‌గ్గింది.

త‌మ‌న్ ఆధిప‌త్యం సాగుతోంది. ఇంత‌కుముందు దేవికి త‌మ‌న్ పోటీనివ్వ‌లేక‌పోయాడు. కానీ ఇప్పుడు త‌మ‌న్ పోటీని త‌ట్టుకోవ‌డ‌మే దేవికి క‌ష్టంగా ఉంది. ఈ మ‌ధ్య పుష్ప‌తో దేవి పేరు మ‌ళ్లీ మార్మోగింది కానీ.. అంత‌కుముందు మాత్రం చాలా సినిమాల్లో అత‌ను అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయాడు. దేవి అంత శ్ర‌ద్ధ, స‌మ‌యం పెట్టి ప‌ని చేయ‌ట్లేద‌మో అన్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. దేవి అందించిన కొన్ని ఆడియోల‌ను వింటే అదే అభిప్రాయం క‌లుగుతోంది.

తాజాగా ఖిలాడి సినిమా విష‌యంలో దేవి అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయాడు. ఇందులోని పాట‌ల‌కు పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. పాట‌ల టేకింగ్ ఓకే కానీ.. విన‌డానికి మాత్రం మామూలుగా అనిపించాయి. ఐతే ఇందుక్కార‌ణమేంటో చెప్ప‌క‌నే చెప్పేశాడు ద‌ర్శ‌కుడు ర‌మేష్ వ‌ర్మ‌. ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. దేవి కేవ‌లం అర‌గంట‌లో ఈ సినిమా పాట‌ల ట్యూన్స్ అన్నీ ఇచ్చేసిన‌ట్లు వెల్ల‌డించాడు.

ఓ ఇంట‌ర్వ్యూలో భాగంగా ర‌మేష్ మాట్లాడుతూ.. ఈ సినిమా క‌థ చెప్ప‌డానికి తాను దేవి ద‌గ్గ‌రికి వెళ్తే.. అర్ధ‌రాత్రి ప‌న్నెండు వ‌ర‌కు త‌న‌కు క‌థ చెప్పే అవ‌కాశం ఇవ్వ‌లేద‌ని.. ఆ త‌ర్వాత క‌థ చెప్ప‌మన్నాడ‌ని.. క‌థ పూర్త‌య్యేస‌రికి మూడు మూడున్న‌ర అయింద‌ని.. అప్ప‌టిక‌ప్పుడు మొద‌లుపెట్టి అర‌గంట‌లో ఆరు ట్యూన్లు ఇచ్చాడ‌ని.. అందులో ఐదు పాట‌లు సినిమాలో వాడామ‌ని అన్నాడు ర‌మేష్‌. దేవి పాట‌ల గురించి ర‌మేష్ నెగెటివ్ కామెంట్స్ ఏమీ చేయ‌లేదు కానీ.. ఈ వీడియోను నెటిజ‌న్లు వైల‌ర్ చేస్తూ దేవిని ట్రోల్ చేస్తున్నారు. అర‌గంట‌లో ఆరు పాట‌లా.. అందుకే ఆల్బం ఇంత యావ‌రేజ్‌గా ఉంద‌ని, త‌మ‌న్‌తో దేవి పోటీ ప‌డ‌లేక‌పోతుండ‌టానికి ఇదే కార‌ణ‌మ‌ని కౌంట‌ర్లు వేస్తున్నారు.