త్రివిక్ర‌మ్‌కి ఇదే లాస్ట్ ఛాన్స్‌..

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌ చివ‌రిగా `అల వైకుంఠపురంలో`చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించి మంచి విజ‌యాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఈ మూవీ త‌ర్వాత‌ త్రివిక్ర‌మ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌తో ఓ చిత్రం చేయాల్సి ఉన్నా.. ప‌లు కార‌ణాల వ‌ల్ల ఈ ప్రాజెక్ట్ అట‌కెక్కింది. దీంతో ఆయ‌న త‌న త‌దుప‌రి చిత్రాన్ని సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో ప్ర‌క‌టించాడు.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో పొడుగు కాళ్ల సుంద‌రి పూజా హెగ్డే హీరోయిన్‌గా క‌నిపించ‌బోతోంది. అలాగే ఎస్ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించనున్నారు. `SSMB28` అనే వర్కింగ్ టైటిల్‌తో ఫిబ్ర‌వ‌రి 3న రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభ‌మైంది.

ఇక‌పోతే మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెర‌కెక్కుతున్న‌ హ్యాట్రిక్ మూవీ ఇది. ఒక ర‌కంగా త్రివిక్ర‌మ్‌కు ఇది మ‌హేష్ ఇచ్చిన లాస్ట్ ఛాన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే, ఇంత‌కు ముందు వీరిద్ద‌రూ క‌లిసి అత‌డు, ఖలేజా చిత్రాల‌ను చేశారు. అయితే భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన‌ ఈ రెండు చిత్రాలు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను అందుకోవ‌డంలో విఫ‌లం అయ్యాయి.

కానీ, బుల్లితెర‌పై మాత్రం ఆక‌ట్టుకున్నాయి. ఈ నేప‌థ్యంలోనే త్రివిక్ర‌మ్, మ‌హేష్ హ్యాట్రిక్ మూవీ అయినా సూప‌ర్ హిట్ అందుకుంటుందా..? లేదా..? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఒకవేళ‌ ఈ సినిమా రిజ‌ల్ట్‌లో ఏ మాత్రం తేడా వ‌చ్చినా మ‌హేష్ మ‌ళ్లీ త్రివిక్ర‌మ్ ముఖం కూడా చూడ‌ర‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో టాక్ న‌డుస్తోంది.