రెండు మూడు వారాల నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ వెలవెలబోతోంది. సంక్రాంతి సినిమాలు కాస్త సందడి చేశాక.. కనీస స్థాయిలో ప్రభావం చూపిన సినిమాలేవీ లేవు. రిలీజ్‌లే తగ్గిపోగా.. విడుదలైన సినిమాలు కూడా ఏమాత్రం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేకపోయాయి. జనవరి చివరి వారంలో వచ్చిన గుడ్ లక్ సఖి తొలి రోజు సాయంత్రానికే చేతులెత్తేసింది.
వీకెండ్‌ను కూడా ఉపయోగించుకోలేకపోయింది. గత వారాంతానికి షెడ్యూల్ అయిన డీజే టిల్లు ఎందుకో వారం వెనక్కి వెళ్లిపోయింది. తెలుగులో ఇంకే పేరున్న సినిమా కూడా రిలీజ్ కాలేదు. ఇదే మంచి తరుణం అనుకుని విశాల్ తన కొత్త చిత్రం సామాన్యుడును థియేటర్లలోకి దించాడు. తమిళంలో కూడా పెద్దగా పోటీ లేకుండా విడుదలైందీ చిత్రం. తెలుగులో విశాల్ సినిమాల్లో ఏదీ ఇప్పటిదాకా విడుదల కాని స్థాయిలో దీనికి రిలీజ్ ఛాన్స్ దక్కింది.
కోరుకున్న దాని కంటే ఎక్కువే థియేటర్లు ఇచ్చారు.
కానీ ఏం లాభం.. సామాన్యుడు ఈ అవకాశాన్ని ఏమాత్రం ఉపయోగించుకోలేకపోయింది. ఈ సినిమాకు మామూలుగానే బజ్ లేదు. తొలి రోజు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేకపోయింది. ఇక సినిమాకు డిజాస్టర్ టాక్ రావడంతో ఫస్ట్ డేనే బాక్సాఫీస్ దగ్గర దారుణమైన పరిస్థితి ఎదుర్కొంది.
థియేటర్ల మెయింటైనెన్స్‌కు సరిపడా డబ్బులు కూడా రాని పరిస్థితి. తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ చిత్రానికి 50 లక్షలు కూడా షేర్ రాలేదు. ఇక తర్వాతి రోజుల పరిస్థితి కొత్తగా చెప్పేదేముంది. శని, ఆదివారాల్లో కూడా వసూళ్లు పుంజుకోలేదు. సినిమాను నడిపిస్తే ఆదాయం రాకపోగా.. మెయింటెనెన్స్ భారంగా మారడంతో చాలా చోట్ల షోలు ఆపేసే పరిస్థితి. అడ్వాంటేజ్‌ను ఉపయోగించుకుంటాడనుకుంటే.. విశాల్ సినిమాకు ఇలాంటి దయనీయమైన పరిస్థితి తలెత్తింది.