టాలీవుడ్లో సూపర్ ఫాస్టుగా సినిమాలు తీసే స్టార్ డైరెక్టర్ ఎవరు అంటే అందరూ తడుముకోకుండా పూరి జగన్నాథ్ అని చెప్పేస్తారు. స్క్రిప్టు రాయడంలో, సినిమా తీయడంలో ఆయన స్పీడే వేరు. కాబట్టే తనతో పాటు దర్శకులుగా కెరీర్ ఆరంభించిన చాలామంది 10-15 సినిమాల దగ్గరుంటే ఆయన మాత్రం 40 సినిమాల దాకా లాగించేశారు.
చిన్నా పెద్దా తేడా లేకుండా ఏ హీరోతో అయినా నాలుగైదు నెలల్లో సినిమా తీసేయడం పూరీకి అలవాటు. కానీ కెరీర్లో తొలిసారిగా ఒక చిత్రం పూర్తి చేయడానికి ఆయనకు దాదాపు రెండేళ్ల సమయం పట్టింది. ఈ సినిమా షూటింగ్ 2020 జనవరిలో మొదలైంది. కరోనా మహమ్మారి చాలా సినిమాల్లాగే దీన్ని కూడా దెబ్బ కొట్టింది.
అయినా సరే.. పూరీ స్పీడు ప్రకారం చూస్తే ఎప్పుడో సినిమా పూర్తయి ఉండాలి. విడుదల కూడా అయిపోయి ఉండాలి.
పూరి కెరీర్లోనే ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో రెండేళ్లకు పైగా నిర్మాణంలో ఉన్న ఈ చిత్రం ఎట్టకేలకు షూట్ పూర్తి చేసుకుంది. ఈ ఆదివారమే లైగర్ చిత్రానికి గుమ్మడి కాయ కొట్టారు. ఈ విషయాన్ని ఒక పోడ్ కాస్ట్లో పూరీ స్వయంగా వెల్లడించాడు. లైగర్ పూర్తయిన అప్ డేట్ ఇస్తూనే.. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం కూడా చెప్పాడు పూరి.
చివర్లో ఇక జనగణమన అనడం ద్వారా.. తన కొత్త సినిమా కబురు కూడా చెప్పేశారు. విజయ్ దేవరకొండతోనే పూరి తన కలల ప్రాజెక్టు అయిన జనగణమన తీయడానికి సన్నాహాలు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కథానాయికగా జాన్వి కపూర్ ఓకే అయింది. ఐతే ఈ ప్రాజెక్టు గురించి ఇప్పటిదాకా అధికారిక ప్రకటన మాత్రం ఏదీ రాలేదు. పూరి నోట జనగణమన మాట రావడంతో ఈ ప్రాజెక్టు అధికారికంగా ఖరారైనట్లే అన్నమాట. లైగర్ విడుదలకు ముందే.. చాలా స్పీడుగా ఈ సినిమాను లాగించేయడానికి పూరి ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం.