హరి హర వీరమల్లు.. ఇంట్రెస్టింగ్ అప్‌డేట్


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘హరిహర వీరమల్లు’. పవన్ నటిస్తున్న తొలి చారిత్రక నేపథ్యం ఉన్న చిత్రం కూడా ఇదే. ఈ సినిమా టీజర్ రిలీజైనపుడు అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. ఐతే వాళ్ల ఎగ్జైట్మెంట్‌ను నిలబెట్టేలా ఈ సినిమా త్వరగా పూర్తి కాలేదు. విడుదల కూడా బాగా ఆలస్యం అవుతోంది. మధ్యలో ‘భీమ్లా నాయక్’ రావడం వల్ల ఈ చిత్రం ఆలస్యమైంది. కరోనా వల్ల కూడా షెడ్యూల్స్ డిస్టర్బ్ అయ్యాయి.

ఐతే ఎట్టకేలకు షూటింగ్ పున:ప్రారంభిస్తున్నారు. ఇందుకు సంబంధించిన సన్నాహాల్లో ఉన్నట్లు టీం సంకేతాలు ఇస్తూనే ఉంది. తాజాగా పవన్, క్రిష్‌లతో పాటు నిర్మాత ఎ.ఎం.రత్నం కలిసి చర్చిస్తున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలోకి వచ్చింది. అందులో ఒక విశిష్ఠ వ్యక్తి కూడా ఉన్నాడు. అతనే.. మదన్ కార్కీ. ఇతను లెజెండరీ లిరిసిస్ట్ వైరముత్తు తనయుడు.

తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ గేయ రచయితగా మంచి పేరు సంపాదించడంతో పాటు మాటల రచయితగానూ సత్తా చాటుకున్నాడు. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’ లాంటి భారీ చిత్రాలకు తమిళంలో మాటలు, పాటల బాధ్యత తీసుకున్నది మదనే. ‘బాహుబలి’ కోసం అతను కాలకేయుల భాషను కూడా రూపొందించాడు. ఇప్పుడు ఏ భాషా చిత్రాన్నయినా తమిళంలో అనువదించి మంచి క్వాలిటీతో రిలీజ్ చేయాలంటే మదన్ వైపే చూస్తున్నారు. అతను ‘హరి హర వీరమల్లు’ స్క్రిప్టు చర్చల్లో ఉన్నాడంటే.. ఈ సినిమాలో ఆయన భాగస్వామ్యం ఏంటన్న ఆసక్తి రేకెత్తుతోంది.

బహుశా ‘వీరమల్లు’ను తమిళంలో పెద్ద ఎత్తున రిలీజ్ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లుంది చిత్ర బృందం. రత్నంకు తమిళ మార్కెట్‌పై మంచి పట్టుంది. ఆయన బేసిగ్గా తమిళ నిర్మాతే. ‘హరి హర వీరమల్లు’ చారిత్రక నేపథ్యంతో తెరకెక్కుతున్న సినిమా కావడంతో దీన్ని తమిళంలో రిలీజ్ చేస్తే బాహుబలి స్థాయిలో కాకున్నా మంచి ఫలితమే రాబడుతుందని భావిస్తున్నట్లున్నారు.