కరోనా భయం జనాల్లో ఏమాత్రం కనిపించడం లేదు. వ్యాపారాలన్నీ యధావిధిగా నడిచిపోతున్నాయి. జనాలు మామూలుగానే తిరిగేస్తున్నారు. కానీ కరోనా థర్డ్ వేవ్ విషయంలో చాలా భయపడిపోయి సంక్రాంతికి రావాల్సిన భారీ చిత్రాలు వాయిదా పడిపోయాయి. ఆ తర్వాత రావాల్సిన మీడియం రేంజ్ సినిమాలు కూడా వెనక్కి తగ్గాయి. దీంతో బాక్సాఫీస్ వెలవెలబోతోంది.
సంక్రాంతి వీకెండ్ తర్వాత రెండు వారాల్లో రిలీజైన చెప్పుకోదగ్గ చిత్రం అంటే ‘గుడ్ లక్ సఖి’ ఒక్కటే. అది డిజాస్టర్ టాక్ తెచ్చుకుని తొలి వీకెండ్లోనే అడ్రస్ లేకుండా పోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో బోలెడన్ని థియేటర్లు అందుబాటులో ఉన్నా ఉపయోగించుకునే సినిమానే కనిపించడం లేదు. ఈ వారానికి షెడ్యూల్ అయిన ‘డీజే టిల్లు’ కూడా వాయిదా పడిపోవడంతో ప్రేక్షకులకు థియేటర్లకు వెళ్లడానికి కారణమే కనిపించడం లేదు.ఐతే తెలుగు సినిమాల నిర్మాతలందరూ చేతులెత్తేసిన టైంలో ఓ తమిళ అనువాద చిత్రం శుక్రవారం బాక్సాఫీస్ బరిలో నిలుస్తోంది. అదే విశాల్ నటించిన ‘సామాన్యుడు’.
కరోనా భయాలను పక్కన పెట్టేసి ఈ చిత్రాన్ని తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ చేసేస్తున్నాడు విశాల్. తు.పా.శరవణన్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రం.. విశాల్ స్టయిల్లో సాగే యాక్షన్ ఎంటర్టైనర్ లాగా కనిపిస్తోంది. తెలుగులో అసలు పోటీయే లేదీ చిత్రానికి.
విశాల్ కెరీర్లోనే అత్యధిక థియేటర్లలో దీన్ని రిలీజ్ చేస్తున్నారు. కోరుకున్నన్ని థియేటర్లు ఇచ్చేశారు. ఇది తప్ప కనీస స్థాయిలో పేరున్న సినిమా ఏదీ రిలీజ్ కావట్లేదీ వారం. ఆల్రెడీ సంక్రాంతి సినిమాలతో పాటు తర్వాత వచ్చిన సినిమాల థియేట్రికల్ రన్ ముగిసిపోయింది. ‘సామాన్యుడు’కు అసలు ఎదురే లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఈ వారం బాక్సాఫీస్‌ను విశాల్‌కు రాసిచ్చేసినట్లే. మరి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ‘సామాన్యుడు’తో హిట్ కొడతాడేమో చూడాలి విశాల్.