త్రివిక్రమ్‌కు సీనియర్ నటుడి వార్నింగ్!

‘మిర్చి’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ సంపాదించిన క్యారెక్టర్ నటుడు సంపత్. ఈ తమిళ నటుడి ప్రతిభ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ‘మిర్చి’ కంటే ముందే దమ్ము, పంజా సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయినప్పటికీ.. ‘మిర్చి’తో వచ్చిన పేరే వేరు. ఆ తర్వాత ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. పెద్దా చిన్నా కలిసి తెలుగులో ఇప్పటికే 50 సినిమాల దాకా చేసేశారు సంపత్.

ఐతే ఎన్ని సినిమాలు చేసినా.. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక లెంగ్తీ క్యారెక్టర్ చేయలేదన్న అసంతృప్తి తనలో ఉందని.. ఈ విషయంలో త్రివిక్రమ్ తనకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని ఓ ఇంటర్వ్యలో సరదాగా వ్యాఖ్యానించారు సంపత్. తొలిసారిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో తక్కువ నిడివి ఉన్న విలన్ పాత్ర చేశాడు సంపత్. ఐతే ఆ సినిమా చేస్తున్నపుడు ‘‘ఇది చిన్న పాత్ర. భవిష్యత్తులో మీతో కనీసం 25 రోజులు పని చేసేలా ఒక పాత్ర రాస్తా’’ అని త్రివిక్రమ్ తనకు మాటిచ్చినట్లు సంపత్ వెల్లడించాడు.

తర్వాత కూడా తాను త్రివిక్రమ్‌తో పని చేశానని.. కానీ తనకు మాట ఇచ్చినట్లు పెద్ద పాత్ర ఇంత వరకు రాయలేదని.. తనకు అలాంటి పాత్ర ఇవ్వకపోతే లొకేషన్‌కు వచ్చి కెమెరా ఎత్తుకుపోతానని బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చానని సంపత్ చెప్పాడు. ఇప్పుడు త్రివిక్రమ్ ఏదో సినిమా చేయబోతున్నారని.. కచ్చితంగా తాను అన్నంత పని చేస్తానని సరదాగా వ్యాఖ్యానించారు సంపత్.

‘ఎఫ్-3’ షూటింగ్ సందర్భంగా త్రివిక్రమ్ స్నేహితుడైన సునీల్ దగ్గరికి వెళ్లి త్రివిక్రమ్ ఎక్కడుంటారు ఏంటని అడిగానని.. వివరాలు చెప్పారని.. కాబట్టి త్వరలోనే త్రివిక్రమ్ దగ్గరికెళ్లి కెమెరా పట్టుకొచ్చేస్తానని అన్నారు సంపత్. ఇదిలా ఉండగా చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్న తాను.. ఆపై తన భార్య నుంచి తాను విడాకులు తీసుకున్నానని.. సీనియర్ నటి శరణ్య తన మాజీ భార్య అన్నది అవాస్తవమని.. మీడియా వాళ్లు తప్పుగా రాశారని.. ఆమె తనకు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ అని స్పష్టం చేశారు సంపత్.