డీజే టిల్లుకు మ‌ళ్లీ ఏమైంది?

ఒక‌ప్పుడు ఒక చిత్రానికి రిలీజ్ డేట్ ఇచ్చి దాన్ని మార్చాలంటే చాలా ఇబ్బంది ప‌డిపోయేవారు నిర్మాత‌లు. చెప్పిన డేట్‌కి సినిమాను రిలీజ్ చేయ‌క‌పోతే దాన్నో అవ‌మానంలానూ ఫీల‌య్యేవాళ్లు. కానీ క‌రోనా మ‌హ‌మ్మారి వ‌చ్చి ఈ ఆలోచ‌న‌ల‌కు చ‌ర‌మ‌గీతం పాడేసింది. ఆర్ఆర్ఆర్ లాంటి భారీ చిత్రాల‌కే నాలుగైదుసార్లు రిలీజ్ డేట్ మార్చాల్సి వ‌చ్చాక ఇక మిగ‌తా సినిమాల సంగ‌తి చెప్పేదేముంది?

ఎన్న‌డూ లేని విధంగా ఈ డేట్ కాకుంటే ఆ డేట్ అంటూ ఒకేసారి రెండు ఆప్ష‌న్లు ఇచ్చే కొత్త సంస్కృతి చూస్తున్నాం ఇప్పుడు. ఒక సినిమాకు డేట్ ఇచ్చాక‌.. అది థియేట‌ర్ల‌లో దిగే వ‌ర‌కు గ్యారెంటీ ఉండ‌ట్లేదు. విడుద‌ల‌కు రెండు మూడు రోజుల ముందు కూడా ఆలోచ‌న మారిపోయి రిలీజ్ ఆపేస్తున్న ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. ఈ వారం రావాల్సిన డీజే టిల్లు సినిమా విష‌యంలోనూ ఇలాగే జ‌రిగిన‌ట్లు క‌నిపిస్తోంది.

ముందుగా సంక్రాంతికి ఈ సినిమాకు రిలీజ్ డేట్ ఇచ్చారు. త‌ర్వాత ఫిబ్ర‌వ‌రి 4కు విడుద‌ల‌ను వాయిదా వేశారు. కొత్త‌గా ఈ డేట్ ఇచ్చి కొన్ని రోజుల ముందు వ‌ర‌కు ప్ర‌మోష‌న్లు కూడా బాగానే చేశారు. ఫిబ్ర‌వ‌రి 2న ట్రైల‌ర్ కూడా లాంచ్ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. కానీ ఇప్పుడేమైందో ఏమో.. ఉన్న‌ట్లుండి విడుద‌ల విష‌యంలో వెన‌క్కి త‌గ్గిన‌ట్లు క‌నిపిస్తోంది.

విడుద‌ల‌కు రెండు రోజులే ఉండ‌గా బుకింగ్స్ ఓపెన్ కాలేదు. ప్ర‌మోష‌న్ల హంగామా కూడా ఏమీ లేదు. ఈ సినిమా నిర్మాణ సంస్థ హ్యాండిల్లో అప్ డేట్స్ ఆగిపోయాయి. కాస్ట్ అండ్ క్రూలో ఎవ్వ‌రూ స్పందించ‌డం లేదు. దీంతో ఈ వారానికి డ‌బ్బింగ్ మూవీ సామాన్యుడునే ప్రేక్ష‌కుల‌కు ఏకైక ఆప్ష‌న్ లాగా క‌నిపిస్తోంది. ఆ సినిమాను కొంచెం గ‌ట్టిగానే ప్ర‌మోట్ చేసి క్రేజ్ రాబ‌ట్టాల‌ని చూస్తున్నారు. విశాల్ సినిమాకు బోలెడ‌న్ని థియేట‌ర్లు కూడా ద‌క్కేలా ఉన్నాయి.