అల్లరోడి సినిమా ఆగిపోయిందా?

చాలా ఏళ్ల తర్వాత ‘నాంది’ సినిమాతో సోలో హీరోగా మంచి విజయాన్నందుకున్నాడు అల్లరి నరేష్. గత ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఒకప్పుడు కామెడీతో అలరించిన నరేష్.. ఈసారి మాత్రం సీరియస్ మూవీతో మెప్పించి విజయాన్నందుకున్నాడు. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత దక్కిన ఈ విజయం అల్లరోడిని అమితానందానికి గురి చేసింది. హిట్టు కొట్టేశాం కదా అని తొందరపడిపోకుండా అతను ఆచితూచే వ్యవహరించాడు.

కొంచెం గ్యాప్ తీసుకుని ‘సభకు నమస్కారం’ అనే సినిమాను లైన్లో పెట్టాడు. పీఆర్వో టర్న్డ్ ప్రొడ్యూసర్, నందమూరి బ్రదర్స్ జూనియర్ ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్‌లకు అత్యంత సన్నిహితుడైన మహేష్ కోనేరు ప్రొడక్షన్లో ఈ సినిమా మొదలైంది. సతీష్ మల్లంపాటి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాల్సింది.

గత ఏడాది మధ్యలో ఈ సినిమా షూటింగ్ మొదలవుతున్నట్లు అప్‌డేట్ ఇచ్చారు. తర్వాత ఏ సమాచారం లేదు.కొన్ని నెలలకే నిర్మాత మహేష్ కోనేరు హఠాత్తుగా గుండెపోటుతో చనిపోయాడు. ఆయన దీంతో పాటుగా మరికొన్ని చిత్రాల నిర్మాణానికి కూడా సన్నాహాలు చేసుకుంటున్న దశలో ఈ హఠాత్పరిణామం చోటు చేసుకుంది. షూటింగ్ ఆరంభ దశలో ఉండగానే నిర్మాత చనిపోవడంతో ఈ సినిమా హోల్డ్‌లో పడింది. ఇంకో కొత్త నిర్మాత రంగంలోకి దిగితే తప్ప సినిమా ముందుకు కదిలే పరిస్థితి లేదు.

దీంతో దాన్ని అలా పక్కన పెట్టి నరేష్ ఇప్పుడు కొత్త సినిమాను మొదలుపెడుతున్నాడు. హాస్య మూవీస్ అనే కొత్త బేనర్, జీ స్టూడియోస్ భాగస్వామ్యంతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఏఆర్ మోహన్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. మంగళవారమే ఈ చిత్రానికి ముహూర్తం పూర్తి చేశారు. దీంతో పాటే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలవుతోంది. కొన్ని నెలలుగా ‘సభకు నమస్కారం’ గురించి సమాచారం ఏదీ లేని నేపథ్యంలో ఈ చిత్రం ఆగిపోయినట్లేనని భావిస్తున్నారు.