సూపర్ హిట్ సినిమాలకు సీక్వెల్స్ తీయాలని చాలా మంది దర్శకనిర్మాతలు భావిస్తుంటారు. కానీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా సీక్వెల్స్ ను తెరకెక్కించడం పెద్ద సవాల్ అనే చెప్పాలి. ఇప్పటివరకు టాలీవుడ్ లో వచ్చిన సీక్వెల్స్ వర్కవుట్ అయిన దాఖలాలు చాలా తక్కువ. అందుకే కొందరు అసలు సీక్వెల్స్ జోలికి వెళ్లడానికి ఇష్టపడరు. అందులో దర్శకధీరుడు రాజమౌళి ఒకరు.
ఆయన రూపొందించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్. కానీ ఇప్పటివరకు సీక్వెల్ చేయాలనే ఆలోచన ఆయనకు రాలేదు. ఆయన తండ్రి రచయిత విజయేంద్రప్రసాద్ మాత్రం కొన్ని సీక్వెల్ కథలు రాసుకుంటున్నారు. ‘విక్రమార్కుడు 2’ సినిమా ప్రస్తుతం చర్చల దశలో ఉంది. ఈ సినిమాకి దర్శకుడు మాత్రం రాజమౌళి కాదు. అలానే ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి కూడా సీక్వెల్ ఉందట.
అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ లు ఏడాది పాటు ఇంటికి దూరంగా గడిపారు. వారిద్దరూ అనుకోని పరిస్థితుల్లో కలిసి, స్నేహం చేస్తే ఏం జరిగి ఉంటుందనే ఊహతో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను రూపొందించారు. నిజానికి చరిత్రలో ఇలా జరగలేదు. ఇది కేవలం రాజమౌళి ఆలోచన మాత్రమే. ఫైనల్ గా అల్లూరి, కొమరం భీమ్ వారి వారి దారుల్లో స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనడానికి బయలుదేరే సీన్ తో ‘ఆర్ఆర్ఆర్’ కథ ముగుస్తుందట.
ఆ దశలో కూడా ఇద్దరూ కలిసి పోరాడితే ఎలా ఉంటుందనే ఆలోచన విజయేంద్రప్రసాద్ కి వచ్చిందట. ‘బాహుబలి2’కి కొనసాగింపుగా నెట్ ఫ్లిక్స్ కోసం ఓ స్క్రిప్ట్ ను తయారు చేశారు. కానీ అది వర్కవుట్ కాలేదు. ‘ఆర్ఆర్ఆర్2’ చేసే ఉద్దేశం ఉంటే గనుక దాన్ని ఓటీటీకి ఇవ్వాలని భావిస్తున్నారు. ‘విక్రమార్కుడు2’ మాదిరి ‘ఆర్ఆర్ఆర్2’ని కూడా మరో దర్శకుడికి అప్పగిస్తారట.