హృతిక్ జీవితంలోకి కొత్త‌మ్మాయి?

బాలీవుడ్ సూప‌ర్ స్టార్ల‌లో ఒక‌డైన హృతిక్ రోష‌న్ చాలా ఏళ్ల నుంచి సింగిల్‌గానే ఉంటున్నాడు. తానెంతో ఇష్ట‌ప‌డి, ప్రేమించి పెళ్లి చేసుకున్న సుసానె ఖాన్‌తో అత‌ను ఎనిమిదేళ్ల కింద‌టే విడిపోవ‌డం తెలిసిందే. త‌న తొలి చిత్రం క‌హోనా ప్యార్ హై రిలీజైన కొన్ని నెల‌ల‌కే అత‌ను సుసానెను పెళ్లాడాడు. 14 ఏళ్ల వైవాహిక బంధానికి 2014లో వీళ్లిద్ద‌రూ తెర‌దించారు. అప్ప‌టికే వీరికి ఇద్ద‌రు పిల్ల‌లున్నారు.

భార్యాభ‌ర్త‌లుగా విడిపోయిన‌ప్ప‌టికీ.. పిల్ల‌ల కోసం త‌ల్లిదండ్రులుగా అప్పుడ‌ప్పుడూ క‌లుస్తూనే ఉన్నారు. స్నేహితుల్లా మెలుగుతున్నారు. మ‌ధ్య‌లో హృతిక్‌కు కంగ‌నాతో ఎఫైర్ ఉన్న‌ట్లుగా వార్త‌లొచ్చాయి. దాని మీద పెద్ద వివాదం న‌డ‌వ‌డ‌మూ తెలిసిందే. అది త‌ప్పితే హృతిక్ గురించి పెద్ద‌గా ఎఫైర్ వార్త‌లైతే రాలేదు. 

కానీ ఇప్పుడు అత‌డి జీవితంలోకి కొత్త‌మ్మాయి ప్ర‌వేశించిన‌ట్లుగా బాలీవుడ్ మీడియాలో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుండ‌టం గ‌మ‌నార్హం. నిప్పు లేనిదే పొగ రాదు అన్న‌ట్లుగా.. బాలీవుడ్ మీడియా ఊరికే ఏమీ ఈ ఊహాగానాలు చేయ‌ట్లేదు. తాజాగా హృతిక్ ముంబ‌యిలోని ఒక ఫేమ‌స్ జ‌ప‌నీస్ రెస్టారెంట్లో విందుకు హాజ‌ర‌య్యాడు.

అక్క‌డి నుంచి బ‌య‌టికి వ‌చ్చేట‌పుడు ఒక అమ్మాయి చేయి ప‌ట్టుకుని న‌డిపించుకుంటూ కారు ద‌గ్గ‌రికి తీసుకొచ్చాడు. వాళ్లిద్ద‌రి మ‌ధ్య సాన్నిహిత్యం.. త‌న‌ను హృతిక్ ప్రొటెక్ట్ చేసిన తీరు చూస్తే జ‌స్ట్ ఫ్రెండ్ లాగా అనిపించ‌డం లేదు. మాస్క్ వేసుకుని ఉండ‌టంతో ఆ అమ్మాయిని ఎవ‌రూ గుర్తుప‌ట్ట‌లేదు. ఆమె సినిమా రంగానికి చెందిన అమ్మాయి కాద‌ని.. ఆమె హృతిక్ జీవితంలో ఇప్పుడు ముఖ్య‌మైన వ్య‌క్తిగా మారింద‌ని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. మ‌రి ఈ మిస్ట‌రీ గర్ల్ ఎవ‌రో ఏంటో హృతిక్ వివ‌ర‌ణ ఇస్తాడేమో చూడాలి.