టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు అప్పుడప్పుడు చిన్న సినిమాలకు సపోర్ట్ చేస్తుంటారు. మేకింగ్ మధ్యలో ఉండగా సినిమాను టేకప్ చేయడం.. లేదంటే సినిమా రెడీ అయ్యాక చూసి దాన్ని తన బేనర్ మీద రిలీజ్ చేయడం లాంటివి చేస్తుంటారు. ఆయనకు ఓ సినిమా మీద గురి కుదిరిందంటే.. ఆ సినిమాలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని ప్రేక్షకులు నమ్ముతుంటారు. కొన్నాళ్ల కిందట ఆయన ఇలా నమ్మే ఒక సినిమాకు బ్యాకప్ ఇచ్చారు.
ఆ చిత్రమే.. గుడ్ లక్ సఖి. ఈ సినిమాను సుధీర్ చంద్ర, శ్రావ్య వర్మ అనే చిన్న నిర్మాతలు ప్రొడ్యూస్ చేశారు. కీర్తి సురేష్, జగపతిబాబు, ఆది పినిశెట్టి లాంటి ప్రముఖ ఆర్టిస్టులు.. నగేష్ కుకునూర్, దేవిశ్రీ ప్రసాద్, శ్రీకర్ ప్రసాద్, చిరంతన్ దాస్ లాంటి పేరున్న టెక్నీషియన్లు కలిసి చేసిన సినిమా ఇది. ఈ సినిమా ఘనంగా మొదలైంది.
ఒక దశ వరకు షూటింగ్ కూడా బాగానే సాగింది. కానీ మధ్యలో ఆర్థిక సమస్యలు తలెత్తితే మంచి టీంను చూసి దిల్ రాజు సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చారు.ఒక దశలో ఇది దిల్ రాజు సినిమాగా ప్రచారంలో ఉంది. కానీ తర్వాత ఎందుకో రాజు వెనక్కి తగ్గారు. సినిమాకు పోస్ట్ ప్రొడక్షన్ కూడా సరిగా జరగలేదు. డబ్బింగ్ సహా టెక్నికల్ విషయాల్లో చాలా వీక్‌గా కనిపించింది సినిమా చూస్తుంటే. మధ్యలో ఈ చిత్రం విడుదల విషయంలో ఇబ్బంది పడుతున్నా రాజు జోక్యం చేసుకున్నట్లు కనిపించలేదు.
చివరికి సినిమాల విడుదలకు ఏమాత్రం అనుకూలంగా లేని టైంలో మొక్కుబడిగా సినిమాను రిలీజ్ చేసేశారు. దిల్ రాజుకు సినిమా పసేంటో ముందే అర్థమైపోయే వెనక్కి తగ్గినట్లుగా అనిపిస్తోంది. ఇప్పుడీ సినిమా చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంతమంది ప్రముఖులు కలిసి ఇలాంటి సినిమా చేశారేంటి అని ఆశ్చర్యపోతున్నారు. దిల్ రాజు పేరు మీద సినిమా రిలీజై ఉంటే మాత్రం ఆయన బ్రాండ్ దెబ్బ తినేదే. ఈ సినిమా కోసం రాజు పెట్టిన డబ్బులు వెనక్కి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అయినా సరే.. బ్రాండ్ ముఖ్యం కాబట్టే రాజు వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది.