చైతు వెబ్ సిరీస్.. వినడానికి బాగుంది కానీ..

మజిలీ, లవ్‌స్టోరీ చిత్రాలతో తనలోని నటుణ్ని పూర్తిగా బయటకు తీశాడు నాగచైతన్య. రెండు విజయాలను తన బ్యాగ్‌లో వేసుకున్నాడు. రీసెంట్‌గా ‘బంగార్రాజు’తోనూ హిట్టు కొట్టాడు. అయితే ఈ మూవీ క్రెడిట్‌ ఎక్కువ నాగార్జునకే వెళ్లింది. తండ్రి రేంజ్‌లో చైతు అలరించలేకపోయాడని, అంత ఎనర్జిటిక్ రోల్‌కి అతను న్యాయం చేయలేకపోయాడని కామెంట్స్ వచ్చాయి.      

నిజానికి ఎప్పుడు కొత్తగా కనిపించాలని చైతు ట్రై చేసినా బెడిసికొట్టడం కామన్. బేసిగ్గా అతను కూల్‌గా ఉంటాడు. కాబట్టి తను చేసే పాత్రలు కూడా అలా ఉన్నప్పుడే క్లిక్ అవుతున్నాయి. ఆ జోన్‌లోంచి బైటికొచ్చి కొత్త జానర్స్ ట్రై చేసినప్పుడు చాలాసార్లు చేతులు కాలాయి. బెజవాడ, దడ, సాహసం శ్వాసగా సాగిపో, యుద్ధం శరణం లాంటి చిత్రాలే అందుకు ఉదాహరణ.       

అలా అని ఇవేమీ పెద్ద ప్రయోగాత్మక చిత్రాలు కావు. కూల్‌ గయ్ చైతుని యాక్షన్ హీరోలా ప్రొజెక్ట్ చేయాలని చూశాయి అంతే. అతిగా ఫైట్లు చేయడం, మితిమీరి ఎనర్జిటిక్‌గా కనిపించాలని ప్రయత్నించడం తనకి కలిసి రాలేదు. ఆ మాత్రం మార్పునే జనాలు యాక్సెప్ట్ చేయలేదు. అలాంటిది ఇప్పుడు ఏకంగా గ్రే షేడ్ ఉండే క్యారెక్టర్ చేయడానికి రెడీ అవుతున్నాడు చైతు.        

విక్రమ్ కుమార్ డైరెక్షన్‌లో ఓ వెబ్ సిరీస్ చేయడానికి నాగచైతన్య ఓకే అన్న సంగతి తెలిసిందే. ఇదో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. హారర్ టచ్ కూడా ఉంటుందట. మూడు సీజన్లుగా రాబోతోంది. ఒక్కో సీజన్‌లో ఎనిమిది నుంచి పది ఎపిసోడ్స్ ఉంటాయని తెలుస్తోంది. ఇందులో చైతు జర్నలిస్ట్‌ పాత్రలో కనిపిస్తాడట. కాస్త నెగిటివ్ టచ్ ఉండే పాత్ర అని, అతని లుక్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుందని తెలుస్తోంది. ఇదంతా వినడానికి బానే ఉంది కానీ తనని అలాంటి క్యారెక్టర్‌‌లో జనాలు అంగీకరిస్తారా లేక సినిమా కాదు సిరీస్‌ కాబట్టి వర్కవుటవుతుందా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి మరి.