హీరో గర్ల్ ఫ్రెండ్ కోసం ఆమెను తీసేశారట

90వ దశకంలో బాలీవుడ్‌పై తమదైన ముద్ర వేసిన కథానాయికల్లో రవీనా టాండన్ ఒకరు. హిందీలో అప్పటి స్టార్లందరితోనూ ఆమె సినిమాలు చేసింది. తెలుగులో కూడా నందమూరి బాలకృష్ణతో ‘బంగారు బుల్లోడు’, అక్కినేని నాగార్జునతో ‘ఆకాశ వీధిలో’ లాంటి చిత్రాలలో నటించింది. కన్నడలో ఉపేంద్రతో చేసిన ‘ఉపేంద్ర’తోనూ ఆమెకు మంచి పేరే వచ్చింది.

ఐతే బాలీవుడ్లో ఆమె ఇంకా పెద్ద రేంజికి వెళ్లాల్సింది కానీ.. ఒక దశ తర్వాత ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. ఇందుకు ఒక హీరో గర్ల్ ఫ్రెండ్ అయిన మరో హీరోయిన్ కారణమని ఇప్పుడు రవీనా టాండన్ చెబుతుండటం విశేషం. తనను చూసి అసూయ చెంది.. అభద్రతా భావానికి గురై తన చేతిలో ఉన్న మంచి అవకాశాలను దెబ్బ తీసినట్లు ఆ హీరోయిన్ మీద ఆరోపణలు చేసింది రవీనా.

తాను అప్పట్లో ఒక పెద్ద హీరోతో వరుసగా హిట్లు ఇవ్వడంతో తమది హిట్ పెయిర్‌గా మంచి పేరు వచ్చిందని.. దీంతో ఆ హీరోతో మళ్లీ జత కట్టే అవకాశం దక్కిందని.. ఐతే తనను చూసి ఇన్ సెక్యూర్‌గా ఫీలైన సదరు హీరో గర్ల్ ఫ్రెండ్ అయిన హీరోయిన్.. అతడికి చెప్పి బలవంతంగా తనను ఒక సినిమా నుంచి తప్పించిందని రవీనా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఆ హీరో మొహమాట పడుతూనే ఈ విషయం తనతో చెప్పాడని రవీనా వెల్లడించింది.

తానేమీ మాట్లాడకుండా ఆ సినిమా నుంచి తప్పుకున్నానని.. కానీ తర్వాత ఇదే అమ్మాయి వల్ల మరో హీరో సినిమాను కూడా తాను కోల్పోయినట్లు రవీనా చెప్పడం విశేషం. కొంత కాలానికి ఆమె మరో హీరో పంచన చేరిందని.. ఆ హీరోతో తాను నటిస్తుండటం కూడా నచ్చకుండా అతడికీ చెప్పి తనను ఓ సినిమా నుంచి తప్పుకునేలా చేసిందని ఆమె వెల్లడించింది. ఐతే ఆమెను నమ్మి తనను సినిమా నుంచి తప్పించిన మొదటి హీరో.. తర్వాత తన దగ్గరికి వచ్చి ఆమె గురించి చెప్పి వాపోయాడని.. దీంతో తాను నవ్వుకున్నానని రవీనా వెల్లడించింది.