శ్యామ్ సింగ రాయ్ అరుదైన ఘ‌న‌త‌

శ్యామ్ సింగ‌రాయ్.. 2021 సంవ‌త్స‌రానికి టాలీవుడ్ చివ‌రి హిట్. క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌రు 24న విడుద‌లైన ఈ చిత్రం ఓ మోస్త‌రు టాక్‌తోనే మంచి ఫ‌లితాన్నందుకుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో టికెట్ల గొడ‌వ కార‌ణంగా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర కొంచెం ప్ర‌తికూల ప‌రిస్థితులు నెల‌కొన్న‌ప్ప‌టికీ ఈ సినిమా అంతిమంగా మంచి విజ‌యాన్నందుకుంది.

శ్యామ్ సింగ రాయ్ థియేట్రిక‌ల్ హ‌క్కులు రూ.20 కోట్ల‌కు అమ్మితే అంత‌కు ఐదారు కోట్లు ఎక్కువ‌గానే షేర్ రాబ‌ట్టిందీ సినిమా. ఇప్పుడు ఓటీటీ రిలీజ్‌లోనూ నాని సినిమా స‌త్తా చాటుతోంది. నెట్ ఫ్లిక్స్‌లో ఇటీవ‌లే విడుద‌లైన శ్యామ్ సింగ రాయ్.. అక్క‌డా అద‌ర‌గొడుతోంది. ఈ చిత్రం గ‌త వారానికి నెట్ ఫ్లిక్స్‌లో అత్య‌ధిక‌ వ‌ర‌ల్డ్ వైడ్ వ్యూయ‌ర్ షిప్ తెచ్చుకున్న చిత్రాల్లో టాప్‌-3 స్థానంలో నిల‌వ‌డం విశేషం.

నెట్ ఫ్లిక్స్‌లో గ‌త వారం ఇండియాలో అత్య‌ధిక మంది చూసిన సినిమా ఇదే. నెట్ ఫ్లిక్స్ టాప్‌-3లో చోటు ద‌క్కించుకున్న ఏకైక ఇండియ‌న్ సినిమా కూడా శ్యామ్ సింగ రాయే. నెట్ ఫ్లిక్స్ ఎప్ప‌టిక‌ప్పుడు వ‌ర‌ల్డ్ వైడ్ వివిధ భాష‌ల్లో ఎన్నో క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌ను దించుతుంటుంది. దానికి వేరే దేశాల్లోనే స‌బ్‌స్క్రైబ‌ర్లు ఎక్కువ‌.

ఇండియ‌న్ స‌బ్ స్క్రైబ‌ర్స్ త‌క్కువే. అయినా స‌రే.. గ‌త వారం నెట్ ఫ్లిక్స్‌లో అత్య‌ధిక వ్యూయ‌ర్ షిప్ తెచ్చుకున్న టాప్-3 మూవీగా నిల‌వ‌డం గొప్ప విష‌యం. నాని కెరీర్లోనే అత్య‌ధిక బ‌డ్జెట్లో తెర‌కెక్కిన శ్యామ్ సింగ రాయ్.. అత‌డికి అత్యావ‌శ్య‌క విజ‌యాన్ని అందించింది. వి, ట‌క్ జ‌గ‌దీష్ చిత్రాలు ఓటీటీలో రిలీజై నిరాశ ప‌రిచాక‌.. ఈ చిత్రం థియేట‌ర్ల‌లో, అలాగే ఓటీటీలో మంచి ఫ‌లితాన్నందుకుని అత‌డికి ఊర‌ట‌నిచ్చింది. రాహుల్ సంకృత్య‌న్ రూపొందించిన ఈ చిత్రాన్ని వెంక‌ట్ బోయ‌న‌ప‌ల్లి నిర్మించాడు. నాని స‌ర‌స‌న సాయిప‌ల్ల‌వి, కృతి శెట్టి న‌టించారిందులో.