జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారన్న వార్త బయటికి వచ్చినప్పటి నుంచి ఈ సినిమాలో ఎవరి పాత్రకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది.. రాజమౌళి ఎవరిని ఎక్కువగా ఎలివేట్ చేసి ఉంటాడు అనే చర్చ నడుస్తూ ఉంది. సినిమా నుంచి ఒక పోస్టర్ రిలీజైనా.. ఇంకేదైనా ప్రోమో వచ్చినా ఈ చర్చ తప్పనిసరి అయిపోతోంది తారక్, చరణ్ అభిమానుల మధ్య. హీరోలిద్దరూ ఎంత సన్నిహితంగా ఉన్నా, ఒకరి గురించి ఒకరు ఎంత గొప్పగా మాట్లాడుకున్నా.. అభిమానుల్లో మాత్రం కొట్లాటలు తప్పట్లేదు.
కాగా ప్రమోషన్లలో మీడియాను కలిసినపుడు, ఈవెంట్లకు హాజరైనపుడు దర్శకుడు రాజమౌళికి ఈ విషయంలో ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి. ఎవరెక్కువ, ఎవరు తక్కువ అని అడుగుతుంటే.. అలాంటిదేమీ ఉండదని, ఇద్దరికీ సమ ప్రాధాన్యం ఉంటుందని, బ్యాలెన్స్ పాటించాననే చెబుతూ వస్తున్నాడు. ఆ విషయంలో జక్కన్న కట్టు తప్పుతాడని ఎవరూ అనుకోవడం లేదు.ఐతే సినిమాలో ఏ పాత్ర ఎలా పండుతుంది.. ఏది బాగా హైలైట్ అవుతుందన్నది పక్కన పెడితే.. రాజమౌళికి రామ్, భీమ్ పాత్రల్లో ఏది ఎక్కువ ఇష్టం అనే ఆసక్తి అందరిలోనూ ఉంది.
ఓ తమిళ ఛానెల్‌కు ఇంతకుముందే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం వెల్లడించాడు జక్కన్న. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమాలో ఏ పాత్ర ఎక్కువ హైలైట్ అవుతుందని అడిగితే.. రెండూ సమాన స్థాయిలో ఉంటాయని, ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ అనేదేమీ ఉండదని జక్కన్న స్పష్టం చేశాడు. మరి వ్యక్తిగతంగా మీకు ఇష్టమైన పాత్ర ఏది అంటే.. అల్లూరి సీతారాజు పాత్ర పట్ల తనకు కొంచెం ఎక్కువ ఇష్టం ఉందని వెల్లడించాడు జక్కన్న.
అది పాత్ర పరంగా వ్యక్తిగతంగా ఉన్న ఇష్టమని కూడా చెప్పాడు. రాజమౌళి అనే కాదు.. బేసిగ్గా తెలుగువారికి అల్లూరి సీతారామరాజు గురించి ఎక్కువ తెలుసు. ఆయన సినిమా సూపర్ హిట్ సినిమా కూడా వచ్చింది. అదొక పాపులర్, హీరోయిక్ క్యారెక్టర్. ఆ రకంగా అందరిలాగే రాజమౌళికి కూడా సీతారామరాజు పాత్ర పట్ల ఆపేక్ష ఉండొచ్చేమో. అంత మాత్రాన సినిమాలో కొమరం భీమ్ పాత్రను తక్కువ చేసినట్లు మాత్రం అనుకోవడానికి వీల్లేదు.