ఓ భాషలో వచ్చిన సినిమాని ఎంతో ఖర్చుపెట్టి, కష్టపడి మరో భాషలో రీమేక్ చేస్తున్నప్పుడు.. అదే సినిమాని డబ్ చేసి థియేటర్స్‌లో రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది? ఎంతో కొంత నష్టమైతే వస్తుంది. అందుకే ‘షెహ్‌జాదా’ మేకర్స్ కంగారుపడ్డారు. కాకపోతే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడంతో నష్టాన్ని తప్పించుకున్నారు.
అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అల వైకుంఠపురములో’ ఎంత పెద్ద హిట్టయ్యిందో తెలిసిందే. ఈ సినిమాని హిందీలో ‘షెహ్‌జాదా’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. రోహిత్ ధావన్ డైరెక్ట్ చేస్తున్నాడు. అమన్ గిల్, భూషణ్ కుమార్‌లతో కలిసి రీమేక్ చేస్తున్నారు అల్లు అరవింద్. కార్తీక్ ఆర్యన్ హీరో. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నవంబర్ 4న విడుదల చేస్తామని ఆల్రెడీ అనౌన్స్ చేశారు.
అయితే ఈ మూవీ డబ్బింగ్ హక్కులు ఆల్రెడీ మనీష్ షాకి చెందిన గోల్డ్‌మైన్స్ సంస్థ తీసుకుంది. రీసెంట్‌గా పుష్ప మూవీ బాలీవుడ్‌లో కూడా సూపర్ హిట్ కావడంతో, బన్నీ నటించిన ‘అల వైకుంఠపురములో’ హిందీ డబ్బింగ్ వెర్షన్‌ని విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు షా. ఆ విషయాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ కూడా చేశారు.
కానీ ఇది తమ సినిమాకి మంచిది కాదని ‘షెహ్‌జాదా’ నిర్మాతలు ఫీలయ్యారు. అందుకే ఆ సంస్థతో మాట్లాడి రిలీజ్‌ని ఆపారు. ఇదంతా అల్లు అరవింద్ చేతుల మీదుగా జరిగినట్లు తెలుస్తోంది. ఏదేమైతేనేం.. షెహ్‌జాదాకి లైన్ క్లియరయ్యింది. లేదంటే ‘పుష్ప’ సృష్టించిన సెన్సేషన్ పుణ్యమా అని దీని ఎఫెక్ట్ కచ్చితంగా రీమేక్ మీద పడి ఉండేది.