మంచు విష్ణు త‌ప్పేం లేద‌న్న న‌రేష్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో టికెట్ల రేట్ల గురించి కొన్ని నెల‌లుగా ఎంత చ‌ర్చ జ‌రుగుతోందో తెలిసిందే. దీని వ‌ల్ల టాలీవుడ్లో అంద‌రు నిర్మాత‌లూ ఇబ్బంది పడుతున్నారు. వేరే రాష్ట్రాల‌తో పోలిస్తే మామూలుగానే ఏపీలో టికెట్ల రేట్లు త‌క్కువంటే.. వాటిని కూడా త‌గ్గించి ఇండ‌స్ట్రీని ఇబ్బందుల్లోకి నెట్టింది జ‌గ‌న్ స‌ర్కారు. దీనిపై ఎవ‌రు నోరెత్తినా వాళ్ల నోళ్ల‌కు తాళాలు వేయించే ప‌నే జ‌రుగుతోంది. టార్గెట్ చేస్తున్నారు. మాట్లాడే వాళ్ల‌ను కూడా మాట్లాడొద్దంటూ ఇండ‌స్ట్రీ వైపు నుంచే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు కూడా ఈ అంశంపై ఇప్ప‌టిదాకా ఏమీ మాట్లాడ‌లేదు. జ‌గ‌న్ త‌న‌కు బావ అంటూ గొప్పగా చెప్పుకునే విష్ణు.. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ అధ్య‌క్ష హోదాలో వెళ్లి ఏపీ సీఎంతో మాట్లాడొచ్చు క‌దా అనే ప్ర‌శ్న‌లు త‌రచుగా వినిపిస్తున్నాయి. దీనిపై సోష‌ల్ మీడియాలో చాలా ట్రోలింగ్ కూడా జ‌రిగింది.

తాజాగా గురువారం త‌న పుట్టిన రోజును పుర‌స్క‌రించుకుని మీడియాను క‌లిసి సీనియ‌ర్ న‌టుడు, మా మాజీ అధ్యక్షుడు, విష్ణుకు స‌న్నిహితుడు కూడా అయిన న‌రేష్‌ను విలేక‌రులు ఈ విష‌య‌మై ప్ర‌శ్నించారు. మంచు విష్ణు ఈ విష‌య‌మై ఎందుకు మాట్లాడ‌ట్లేద‌ని అడిగారు. దీనికి న‌రేష్ బ‌దులిస్తూ.. ఈ విష‌యంలో మంచు విష్ణు జోక్యం అన‌వ‌స‌ర‌మ‌ని, అత‌ను చేస్తున్న‌దాంట్లో త‌ప్పేమీ లేద‌ని అన్నాడు.

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ అంటే ఒక స్వ‌తంత్ర సంస్థ అని.. దాని బాధ్య‌త అంతా న‌టీన‌టుల యోగ‌క్షేమాలు చూడ‌టం వ‌ర‌కే ప‌రిమితం అని.. ప‌రిశ్ర‌మ‌కు సంబంధించిన ఇతర విష‌యాల‌తో దానికి సంబంధం లేద‌ని న‌రేష్ తేల్చేశాడు. టికెట్ల ధ‌ర‌ల అంశం ఫిలిం ఛాంబ‌ర్ ప‌రిధిలో ఉంద‌ని, చిరంజీవి ఇటీవ‌లే ఏపీ సీఎంను క‌లిసి చ‌ర్చించార‌ని.. కాబ‌ట్టి త్వ‌ర‌లోనే ప‌రిష్కారం ల‌భిస్తుంద‌ని ఆశిద్దామ‌ని న‌రేష్ వ్యాఖ్యానించాడు. దీనిపై వ్య‌క్తిగ‌తంగా తానేమీ మాట్లాడ‌లేన‌ని, తాను ఈ అంశాన్ని ఫాలో కాలేద‌ని ఆయ‌న‌న్నాడు.