వేసవిలో యుద్ధాలు తప్పేలా లేవు

సంక్రాంతి ముంగిట సందడి చేయాల్సిన ‘ఆర్ఆర్ఆర్’ వాయిదా పడిపోయింది. పండక్కి రావాల్సిన ‘రాధేశ్యామ్’ కూడా రాలేదు. ముందు సంక్రాంతికే షెడ్యూల్ అయిన భీమ్లా నాయక్, సర్కారు వారి పాట కూడా వెనక్కి వెళ్లాయి. వాటి కొత్త రిలీజ్ డేట్లలో కూడా అవి వచ్చేలా లేవు. శివరాత్రికి ‘భీమ్లా నాయక్’, ఏప్రిల్ 1న ‘సర్కారు వారి పాట’ వచ్చే సంకేతాలు ఎంతమాత్రం కనిపించడం లేదు. ఫిబ్రవరి 4న రిలీజవ్వాల్సిన ‘ఆచార్య’ను వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

ఈ నెలలోనే విడుదల కావాల్సిన ఖిలాడి, మేజర్ కూడా వేసవికి వెళ్లేట్లున్నాయి. మరోవైపేమో ఆల్రెడీ వేసవికి చాలా సినిమాలు షెడ్యూల్ అయి ఉన్నాయి. ఇప్పుడు కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండటంతో థియేటర్లపై ఆంక్షలు పెడుతున్నారు. మూత వేయిస్తున్నారు. కానీ షూటింగ్‌లు మాత్రం పూర్తిగా ఏమీ ఆగిపోలేదు. వేసవికి షెడ్యూల్ అయిన సినిమాలను ఆయా తేదీల్లోనే రిలీజ్ చేయడానికి పెద్దగా ఇబ్బంది రాకపోవచ్చు. 

ఐతే జనవరి, ఫిబ్రవరి నెలల నుంచి వాయిదా పడుతున్న చిత్రాలకు.. ఆల్రెడీ వేసవికి షెడ్యూల్ అయిన చిత్రాలకు థియేటర్లు సర్దుబాటు చేయడం, రిలీజ్ డేట్లు ఖరారు చేయడంలో చాలా ఇబ్బందులు తలెత్తేలా పరిస్థితి కనిపిస్తోంది. సంక్రాంతి ముంగిట ‘ఆర్ఆర్ఆర్’ను రిలీజ్ చేయడానికి ఎంత కష్టపడాల్సి వచ్చిందో తెలిసిందే. వేసవిలోనూ ‘ఆర్ఆర్ఆర్’కు డేట్ ఫిక్స్ చేయడంలో ఇదే సమస్య తప్పకపోవచ్చు.

అలాగే రాధేశ్యామ్, ఆచార్య, భీమ్లా నాయక్, సర్కారు వారి పాట, కేజీఎఫ్-2, బీస్ట్ లాంటి భారీ చిత్రాలకు డేట్లు, థియేటర్లు సర్దుబాటు చేయడం అంత తేలిక కాదు. ఈ విషయంలో యుద్ధాలు తప్పేలా లేవు. ఇది ఏదో ఒక ఇండస్ట్రీకి సంబంధించిన విషయం కూడా కాదు. వివిధ పరిశ్రమలకు చెందిన దర్శకులు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడాకే డేట్లు ఖరారు చేసుకోవాలి. మరి ఈ విషయంలో ఎవరితో ఎవరు ఏమేర సహకరిస్తారన్నది ప్రశ్న.