కరోనాను నియంత్రించేందుకు.. ప్రాణహానిని తగ్గించేందుకు చేపట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ప్రజలను బలవంతం పెడుతున్నారనే విమర్శల నేపథ్యంలో కొందరు కోర్టుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం.. వ్యాక్సిన్ విషయంలో ఎవరినీ బలవంతం పెట్టడం లేదని.. ప్రజలు తమకు ఇష్టం ఉంటేనే వ్యాక్సిన్ తీసుకోవచ్చని స్పష్టం చేసింది. దేశం లో బలవంతంగా టీకాలు ఇవ్వడం లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. లబ్ధిదారులు తమ అభీష్టం మేరకే టీకాను తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.
కరోనా టీకా తప్పనిసరిగా తీసుకోవాలని ఎవరిపైనా ఒత్తిడి చేయడం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీపై కేంద్ర ఆరోగ్య శాఖ జారీ చేసిన మార్గదర్శకాలు సైతం.. అనుమతి లేకుండా చేసే బలవంతపు వ్యాక్సినేషన్‌ను పేర్కొనడం లేదని తెలిపింది. టీకా ధ్రువపత్రం తప్పనిసరి అనే నిబంధన నుంచి దివ్యాంగులను మినహాయించాలని ఓ ఎన్జీఓ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌కు స్పందనగా.. కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ సమర్పించింది. వ్యాక్సినేషన్ ధ్రువపత్రం తప్పనిసరి అన్న నిబంధనను ఇంత వరకు విధించలేదని స్పష్టం చేసింది.
“ప్రస్తుత కరోనా సమయంలో వ్యాక్సినేషన్ అనేది ప్రజలందరి ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని చేపట్టిన కార్యక్రమం. వివిధ పత్రికలు, మాధ్యమాల ద్వారా దీనిపై అందరికీ అవగాహన కల్పిస్తున్నాం. టీకా పంపిణీకి చేసిన ఏర్పాట్లు, కావాల్సిన అర్హతలపై వివరాలు తెలియజేస్తున్నాం. అయితే, ఇష్టం లేకుండా ఏ వ్యక్తికీ బలవంతంగా టీకా వేయడం లేదు.“ అని కేంద్ర ప్రభుత్వం తన అఫిడవిట్లో పేర్కొనడం గమనార్హం.
దివ్యాంగులకు టీకా పంపిణీ విషయమై ఎవారా ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దివ్యాంగులకు ఇంటింటికి వెళ్లి టీకా వేసేలా చూడాలని ధర్మాసనాన్ని కోరింది. అయితే.. దీనిని విచారించిన సందర్భంగా.. టీకాను బలవంతంగా వేస్తున్నారనే వాదనలపై సుప్రీం కోర్టు కేంద్ర ప్రబుత్వాన్ని వివరణ కోరింది. దీంతో మోడీ సర్కారు పై విధంగా స్పందించింది. ఇదిలావుంటే, భారత్‌లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గింది. ఒక్కరోజే.. 2,58,089 లక్షల కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో మరో 385 మంది మరణించారు. 1,51,740 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 19.65 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.