ఎన్టీఆర్.. రివెంజ్ డ్రామా

NTR

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఇప్పుడు మామూలు ఫ్రస్టేషన్లో లేరు. ఎప్పుడో 2018 అక్టోబర్లో రిలీజైంది అతడి చివరి సినిమా ‘అరవింద సమేత’. దీని తర్వాత రాజమౌళి సినిమా ‘ఆర్ఆర్ఆర్’లో పడిపోయాడతను. జక్కన్నతో సినిమా అంటే ఆషామాషీ కాదని అందరికీ తెలుసు. 2020లోనే ఈ సినిమా రిలీజవుతుందని జక్కన్న ఆరంభంలో నొక్కి వక్కాణించినప్పటికీ.. ఎవరికీ ఆ విషయంలో నమ్మకాల్లేవు. బేసిగ్గా రాజమౌళి సినిమాలంటేనే ఆలస్యం.

దీనికి తోడు కరోనా కూడా వెంటాడటంతో ‘ఆర్ఆర్ఆర్’ ఇంకా ఆలస్యం జరిగి 2022 జనవరిలో కూడా రిలీజ్ కాలేదు. ఎప్పుడు విడుదలవుతుందో స్పష్టత కూడా లేదు. దీని వల్ల తారక్ కొత్త సినిమాల విషయంలోనూ ఆలస్యం జరిగింది. ముందు అనుకున్న ప్రకారమైతే ఈపాటికే కొరటాల శివతో సినిమా మొదలై షూటింగ్ జరుగుతుండాలి.

కానీ ఇటు ఆర్ఆర్ఆర్, అటు ఆచార్య ఆలస్యం కావడంతో ఆ సినిమా కూడా లేటైంది. ‘ఆచార్య’ ఏప్రిల్ 1కి వాయిదా పడ్డ నేపథ్యంలో కొరటాల శివతో తారక్ మూవీ వేసవిలో కానీ మొదలయ్యేలా లేదు. ఐతే ఈలోపు ప్రి ప్రొడక్షన్ పనులను వేగవంతం చేయడానికి చూస్తున్నాడు కొరటాల. ఈ సినిమాకు కథ దాదాపుగా రెడీ అయిపోయిందని.. ఇదొక రివెంజ్ డ్రామా నేపథ్యంలో నడిచే సినిమా అని యూనిట్ వర్గాల సమాచారం. ఎమోషన్లు, ఎంటర్టైన్మెంట్, యాక్షన్ సమపాళ్లలో ఉంటాయట.

ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా అనిరుధ్ కన్ఫమ్ అయ్యాడని.. త్వరలోనే మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలవుతాయని తెలిసింది. ఇంకా కథానాయిక విషయంలో మాత్రం ఒక క్లారిటీ రాలేదట. త్వరలోనే హీరోయిన్‌తో పాటు ముఖ్య పాత్రలకు నటీనటులు ఖరారవుతారని సమాచారం. ఈ చిత్రాన్ని కొరటాల మిత్రుడైన మిక్కిలినేని సుధాకర్‌తో కలిసి ఎన్టీఆర్ అన్నయ్య నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించనున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి లేదా వేసవిలో సినిమా రిలీజయ్యే అవకాశాలున్నాయి.