సౌత్ సినిమాలపై నార్త్ హీరోలు బాగా మోజు పడుతున్నారు. డిఫరెంట్ కాన్సెప్టులు, అంతకంటే డిఫరెంట్ టేకింగ్‌తో మనవాళ్లు అందరినీ మెప్పిస్తున్నారు. అందుకే సౌత్‌లో సూపర్ హిట్టయిన సినిమాలన్నింటినీ నార్త్ వాళ్లు పట్టుకుపోతున్నారు. ‘ఖైదీ’ కూడా ఆ వరుసలో ఉంది.
కార్తి హీరోగా లోకేష్ కనకరాజ్ తీసిన ‘ఖైదీ’ తమిళంలోనే కాదు.. తెలుగులోనూ మంచి విజయం సాధించింది. హీరోయిన్ లేదు. పాటలూ రొమాన్సులూ లేవు. స్పెషల్ కామెడీ ట్రాకులూ పెట్టలేదు. అయినా కూడా గ్రిప్పింగ్ నేరేషన్‌తో డైరెక్టర్, ఎక్స్ట్రార్డినరీ పర్ఫార్మెన్స్తో కార్తి ఇంప్రెస్ చేశారు. దాంతో ఈ చిత్రాన్ని బాలీవుడ్లో రీమేక్ చేయడానికి రెడీ అయ్యారు.
అజయ్ దేవగన్ హీరోగా ధర్మేంద్ర డైరెక్షన్లో ఈ రీమేక్‌ని చాలాకాలం క్రితమే అనౌన్స్ చేశారు. అయితే అజయ్ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉండటంతో ఈ ప్రాజెక్ట్ అంతకంతకూ ఆలస్యమవుతూ వచ్చింది. ఎట్టకేలకి ఇప్పుడు మొదలైంది. నిజానికి అజయ్ ‘సింగం 3’ మొదలుపెట్టాల్సి ఉంది. అది కాస్త భారీ చిత్రం కావడంతో ఇప్పుడున్న కోవిడ్ పరిస్థితులు షూటింగ్‌కి అనుకూలించేలా లేవు. దాంతో దాన్ని వాయిదా వేసి, ఆ డేట్స్‌ని ఈ చిత్రానికి కేటాయించాడు అజయ్.
అంతేకాదు.. స్క్రిప్ట్ వర్క్ మొత్తం అజయే స్వయంగా చూస్తున్నాడు. ఒరిజినల్‌కి పూర్తి భిన్నంగా కథను మాడిఫై చేస్తున్నాడు. బాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గ మార్పులూ చేర్పులూ చేస్తున్నాడట. హీరోయిన్ పాత్రని కూడా యాడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తమిళంలోలా కంప్లీట్ సీరియస్‌గా కాకుండా, హిందీ వెర్షన్ కాస్త ఎంటర్టైనింగ్గా ఉండబోతోందట. ‘భోలా’ అనే టైటిల్‌ని కూడా ఫిక్స్ చేశారు. సినిమా మొత్తం ముంబైలోనే తీయబోతున్నారు.