సర్కారు వారి పాట.. మళ్ళీ డౌటే?

అంతా అనుకున్న ప్రకారం జరిగితే ఈపాటికి మహేష్ బాబు సినిమా ‘సర్కారు వారి పాట’ విడుదలకు సంబంధించి హంగామా నడుస్తుండాల్సింది. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయాలని అనుకున్న సంగతి తెలిసిందే. కానీ ‘ఆర్ఆర్ఆర్’ కోసమని సంక్రాంతి బరి నుంచి తప్పుకుని వేసవి ఆరంభానికి వాయిదా పడిందా చిత్రం. ఏప్రిల్ 1న ‘సర్కారు వారి పాట’ను రిలీజ్ చేయాలని అనుకున్నారు.

ఈ నిర్ణయం మహేష్ బాబు అభిమానులు ఆరంభంలో కొంత నిరాశకు గురి చేసినా వేసవి లాంటి మంచి సీజన్లో, అదీ ఆరంభంలోనే రాబోతుండటంతో సినిమాకు లాంగ్ రన్ ఉంటుందని.. ఇంకా పెద్ద విజయం సాధిస్తుందని ఆశాభావంతో ఉన్నారు. సంక్రాంతి రేసు నుంచి సినిమా తప్పుకోవడంతో టీం అంతా కొంత రిలాక్స్ అయింది. మహేష్ ఫ్యామిలీ ట్రిప్ కూడా వెళ్లాడు. అది అయ్యాక, పండుగ సందడి ముగిశాక కొత్త షెడ్యూల్ మొదలుపెట్టాలని అనుకున్నారు.

కానీ ఇంతలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. మహేష్ బాబు కరోనా బారిన పడ్డాడు. దాని వల్ల రెండు మూడు వారాలు ఇంటి నుంచి కదలడానికి వీల్లేకపోయింది. ఇంతలోనే మహేష్ సోదరుడు రమేష్ బాబు మరణం వారి కుటుంబాన్ని విషాదంలోకి నెట్టింది. రమేష్ బాబు మీడియాలో ఉండే వ్యక్తి కాదు కానీ.. మహేష్ బాబుకు చాలా క్లోజ్. ఆయనిలా హఠాత్తుగా మరణించడంతో మహేష్ తీవ్రమైన శోకంలో ఉన్నాడు. దీంతో ఇంకో నెల పాటు షూటింగ్‌కు వచ్చే అవకాశమే కనిపించట్లేదు.

మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి పెరిగిపోయి షూటింగ్‌లకు కూడా ఇబ్బందిగా మారింది. మళ్లీ సాధారణ పరిస్థితులు ఎప్పుడొస్తాయో తెలియట్లేదు. ఇక సాధారణ పరిస్థితులు వచ్చినా.. ముందుగా వేసవి సీజన్లో ‘ఆర్ఆర్ఆర్’ను రిలీజ్ చేయాలనే చూస్తారు. దానికి రెండు మూడు వారాలు గ్యాప్ ఉండేలాగే మహేష్ సినిమాను షెడ్యూల్ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1న ‘సర్కారు వారి పాట’ రావడం అసాధ్యం అనే అంటున్నారు. ఈ విషయం అభిమానులకు ముందే అర్థమైపోయింది. దీని గురించి అధికారిక సమాచారం రావడానికి టైం పట్టొచ్చు.