ట్రైలర్ టాక్: సైకో కిల్లర్‌తో కీర్తి ఫైట్

‘మహానటి’తో జాతీయ అవార్డు గెలిచిన కీర్తి సురేష్.. దాని తర్వాత నటించిన మరో లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘పెంగ్విన్’. ప్రముఖ తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ నిర్మాణంలో ఈశ్వర్ కార్తీక్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన చిత్రమిది. ఈ చిత్రానికి థియేట్రికల్ రిలీజ్ లేకుండా నేరుగా అమేజాన్ ప్రైమ్‌లో ఈ నెల 19న విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే ‘పెంగ్విన్’ టీజర్ రిలీజ్ చేశారు. అందులో కాన్సెప్ట్ ఏంటో చెప్పకుండా ఇది ఒక బిడ్డ కోసం తల్లి చేసే పోరాటం నేపథ్యంలో సాగే సినిమా అన్న సంకేతం ఇచ్చారు. ఈ రోజు ట్రైలర్‌తో సినిమాపై పూర్తి స్పష్టత ఇచ్చారు. గురువారం ‘పెంగ్విన్’ తెలుగు ట్రైలర్‌ను నేచురల్ స్టార్ నాని రిలీజ్ చేయగా.. తమిళంలో ధనుష్, మలయాళంలో మోహన్ లాల్ ట్రైలర్లు లాంచ్ చేశారు.

ఇక ట్రైలర్ విశేషాల్లోకి వెళ్తే.. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తన చిన్నారి కొడుకు ఉన్నట్లుండి కనిపించకుండా పోతే.. అతడి కోసం తల్లి ఎలా తపిస్తుంది.. దట్టమైన అడవిలో తన కొడుక్కి సంబంధించిన వస్తువులు కనిపించి అతను చనిపోయాడనే అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులు ఈ కేసులో చేతులెత్తేస్తే.. ఒంటరిగా కొడుకు కోసం ఆ తల్లి ఎలా పోరాడింది అన్న నేపథ్యంలో సినిమా సాగుతుంది. చిన్న పిల్లల్ని తీసుకెళ్లి తీవ్రంగా హింసించి చంపే ఒక సైకో కిల్లర్ చేతుల్లో తన కొడుకు ఉన్నాడని కనిపెట్టిన కథానాయిక.. ఎవరి సాయం లేకుండా ఆ కిల్లర్‌తో ఎలా ఫైట్ చేసింది.. చివరికి కొడుకును దక్కించుకుందా లేదా అన్నది ఈ నెల 19నే తెలుసుకోవాలి.

ఇలాంటి సైకో కిల్లర్ కథలు చాలానే వచ్చినప్పటికీ.. కథనం ఉత్కంఠభరితంగా సాగేలా కనిపిస్తోంది. ట్రైలర్లో కొన్ని దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేలా చేశాయి. మామూలుగా సైకో కిల్లర్లంటే అమ్మాయిల్ని, పెద్ద వాళ్లను తీసుకెళ్లి చంపుతుంటారు. కానీ చిన్న పిల్లల్ని తీసుకెళ్లి హింసించడం అన్నది కొత్త పాయింట్. దీని వెనుక ఏం కారణం ఉంటుందన్నది ఆసక్తికరం. టీజర్‌ లాగే ‘పెంగ్విన్’ ట్రైలర్ కూడా థ్రిల్లింగ్‌గానే ఉండి సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. మరి ఈ సినిమా ఏ మేర అంచనాల్ని అందుకుంటుందో చూడాలి.