కన్నడ ముద్దుగుమ్మ రష్మిక టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్ గా ఈమె నటించిన ‘పుష్ప’ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓ పక్క తెలుగులో వరుస సినిమాలు చేస్తూనే.. బాలీవుడ్ లో కూడా అవకాశాలు అందిపుచ్చుకుంటుంది.
త్వరలోనే ‘మిషన్ మజ్ను’తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనుంది. దీంతో పాటు ‘గుడ్ బై’ అనే మరో సినిమాలో కూడా నటిస్తోంది. ఇదిలా ఉండగా.. రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తోన్న ఫిమేల్ సెంట్రిక్ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించడానికి ఒప్పుకుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు దీన్ని నిర్మించబోతున్నారు.
ఈ సినిమా కథ మొత్తం రష్మిక చుట్టూనే తిరుగుతుందట. ఈసారి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో రాహుల్ అలరించబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమా 1995వ సంవత్సరంలో జరిగిన కథగా చిత్రీకరించనున్నారు. భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అప్పట్లో భారత దేశ ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నంగా ఉన్న సమయంలో.. ఆర్ధిక సంస్కరణలు చేపట్టి దేశ ఆర్ధిక వ్యవస్థను నిలబెట్టారు. ఇలాంటి నేపధ్యాన్ని దర్శకుడు రాహుల్ తన కథకు జోడించినట్లు తెలుస్తోంది.
ఒక కిరాణా కొట్టు వాడి కూతురు పెద్ద బిజినెస్ విమెన్ గా ఎలా ఎదిగిందనే కాన్సెప్ట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారట. ఇందులో రష్మిక పాత్ర స్ఫూర్తిదాయకంగా ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటివరకు కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన రష్మిక.. తొలిసారి లీడ్ రోల్ పోషించనుంది. మరి ఈ సినిమా ఆమెకి ఎలాంటి గుర్తింపుని తీసుకొస్తుందో చూడాలి!