న‌న్ను త‌గ‌ల‌ బెట్టేస్తార‌నుకున్నా: రాజ‌శేఖ‌ర్


గ‌త రెండేళ్ల వ్య‌వ‌ధిలో క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఎంతోమంది సినీ ప్ర‌ముఖులు, దిగ్గ‌జాలు కాలం చేశారు. గాన గంధ‌ర్వుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం స‌హా ప‌లువురు వైర‌స్‌కు బ‌లై అభిమానులను శోక సంద్రంలో ముంచెత్తారు. కొంద‌రు ఈ మ‌హ‌మ్మారి కార‌ణంగా మృత్యు అంచుల దాకా వెళ్లి వ‌చ్చారు. అందులో సీనియ‌ర్ న‌టుడు రాజ‌శేఖ‌ర్ కూడా ఒక‌రు.

ఆయ‌న‌కు గ‌త ఏడాది క‌రోనా సోకి దాదాపు నెల రోజులు ఐసీయూలో ఉండ‌టం, ఒక ద‌శ‌లో ప‌రిస్థితి విష‌మించ‌డం తెలిసిందే. అదృష్ట‌వ‌శాత్తూ ఆయ‌న ఆ ద‌శ నుంచి కోలుకుని మ‌ళ్లీ మామూలు మ‌నిషి అయ్యారు. కోలుకున్నాక ఆయ‌న శేఖ‌ర్ అనే సినిమాలోనూ న‌టించారు. అది త్వ‌ర‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ అనుభ‌వం గురించి క‌మెడియ‌న్ ఆలీ నిర్వ‌హించే టాక్ షోలో రాజ‌శేఖ‌ర్, ఆయ‌న భార్య జీవిత మాట్లాడారు.

ఆ టైంలో తాను చ‌నిపోతాన‌ని అనుకున్న‌ట్లు రాజ‌శేఖ‌ర్ చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఒక ద‌శ‌లో ప‌రిస్థితి చేయి దాటిపోయింద‌ని అనిపించింద‌ని, ఇంకో మూడు రోజుల్లో తాను చ‌నిపోతాన‌ని, త‌న‌ను తీసుకెళ్లి త‌గ‌ల‌బెట్టేస్తార‌ని అనుకున్నాన‌ని రాజ‌శేఖ‌ర్ ఉద్వేగ స్వ‌రంతో చెప్పారు. జీవిత మాట్లాడుతూ.. శేఖ‌ర్ సినిమా షూటింగ్ మొద‌లుపెడ‌దాం అని అంతా ఏర్పాట్లు చేసుకున్న టైంలో రాజ‌శేఖ‌ర్‌కు క‌రోనా సోకింద‌ని, త‌ర్వాత ఊహించ‌ని విధంగా ప‌రిస్థితి విష‌మించి నెల రోజులు ఆయ‌న ఐసీయూలో ఉండాల్సి వ‌చ్చిందంటూ ఆ రోజుల‌ను గుర్తు చేసుకుని క‌న్నీళ్లు పెట్టేసుకున్నారు.

ఇలాంటి స్థితి నుంచి రాజ‌శేఖ‌ర్ కోలుకుని చేసిన సినిమా కావ‌డంతో శేఖ‌ర్‌ను చాలా ప్ర‌త్యేకంగా భావిస్తాన‌ని జీవిత తెలిపారు. ఇంకా ఈ షోలో త‌మ కెరీర్ తొలి రోజుల గురించి, త‌మ ఇద్ద‌రి తొలి క‌ల‌యిక గురించి రాజ‌శేఖ‌ర్, జీవిత మాట్లాడారు. సినిమాల్లోకి రాక‌ముందు త‌నుకున్న న‌త్తి స‌మ‌స్య గురించి కూడా రాజ‌శేఖ‌ర్ గుర్తు చేసుకున్నారు. ఈ ప్రోమో సోష‌ల్ మీడియాలో బాగా తిరుగుతోంది.