త‌మిళ ద‌ర్శ‌కుడికి పుష్ప టార్చ‌ర్

పాండిరాజ్.. త‌మిళంలో పేరున్న ద‌ర్శ‌కుల్లో ఒక‌డు. ద‌ర్శ‌కుడిగా అత‌ను చేసిన తొలి చిత్రం ప‌సంగ జాతీయ అవార్డుతో  పాటు ప‌లు పుర‌స్కారాలు ద‌క్కించుకుంది. ఆ త‌ర్వాత అత‌ను తీసిన కొన్ని చిత్రాలు తెలుగులో కూడా రిలీజ‌య్యాయి. క‌థ‌క‌ళి, మేము, చిన‌బాబు లాంటి సినిమాల‌తో మ‌న వాళ్ల‌కు కూడా పాండిరాజ్ ప‌రిచ‌య‌మే. ప్ర‌స్తుతం సూర్య హీరోగా ఈటీ అనే సినిమా చేస్తున్నాడు. ఈ ద‌ర్శ‌కుడికి మ‌న స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ అంటే పిచ్చి అట‌.

ఆయ‌న సినిమాల‌ను తాను ఎంత‌గానో ఆరాధిస్తాన‌ని.. ఆర్య మొద‌లుకుని.. సుకుమార్ తీసిన ప్ర‌తి సినిమా చూశాన‌ని, ఆయ‌న నిర్మాణంలో వ‌చ్చిన ఉప్పెన మూవీని కూడా వ‌దిలి పెట్ట‌లేద‌ని పుష్ప త‌మిళ వెర్ష‌న్ స‌క్సెస్ మీట్లో పాండిరాజ్ సుక్కుపై త‌న అభిమానాన్ని చాటుకున్నాడు. అంతే కాక సుకుమార్ తీసిన‌ పుష్ప మూవీతో త‌న‌తో ఏదో క‌నెక్ష‌న్ ఉంద‌ని, ఆ సినిమా త‌న‌ను అనేక ర‌కాలుగా టార్చ‌ర్ పెట్టింద‌ని పాండిరాజ్ చెప్పాడు.

సూర్య‌తో త‌న కొత్త చిత్రానికి ర‌ష్మిక మంద‌న్నాను క‌థానాయిక‌గా ఓకే చేశామ‌ని, ఆమె కూడా సినిమా చేయ‌డానికి రెడీ అయింద‌ని.. కానీ త‌ర్వాత ఫోన్ చేస్తే తానీ సినిమా చేయ‌లేన‌ని చెప్పింద‌ని పాండిరాజ్ వెల్ల‌డించాడు. అందుక్కార‌ణం ఏంట‌ని అడిగితే తాను పుష్ప సినిమాలో క‌థానాయిక‌గా న‌టిస్తున్నానని, త‌న పాత్ర కోసం చాలా హోమ్ వ‌ర్క్ చేయాల‌ని, స్లాంగ్ నేర్చుకోవాల‌ని చెప్పింద‌ని పాండిరాజ్ వెల్ల‌డించాడు.

ఇక ఆ త‌ర్వాత ఒక ఫైట్ సీక్వెన్స్ కోసం రామ్-ల‌క్ష్మ‌ణ్ మాస్ట‌ర్ల‌ను అడిగితే తాము అడ‌విలో ఒక భారీ ఫైట్ తీస్తున్నామ‌ని, చాలా టైం ప‌డుతుంద‌ని అన్నార‌ని, ఏ సినిమా అని అడిగితే పుష్ప అని జ‌వాబిచ్చార‌ని పాండిరాజ్ చెప్పాడు. ఆ త‌ర్వాత ఈటీ సినిమాను డిసెంబ‌రులో రిలీజ్ చేయాల‌నుకున్నామ‌ని, అందుకోసం ఎడిట‌ర్ రూబెన్‌కు ఫోన్ చేస్తే తాను పుష్ప ప‌నిలో బిజీగా ఉన్న‌ట్లు చెప్పాడ‌ని.. ఇక త‌న సినిమాకు ఛాయాగ్రాహ‌కుడిగా ప‌ని చేసిన ర‌త్న‌వేలు ఎప్పుడూ పుష్ప సినిమా గురించి మాట్లాడుతుండేవాడ‌ని.. ఇలా అనేక ర‌కాలుగా పుష్ప‌తో తాను కనెక్ట్ అయి ఉన్నాన‌ని, చివ‌రికి ఈ సినిమా చూస్తే అద్భుతంగా అనిపించింద‌ని, చివ‌రికి స‌క్సెస్ మీట్‌కు త‌న‌ను అతిథిగా పిల‌వ‌డంతో ఈ సినిమాతో ఏదో తెలియ‌ని క‌నెక్ష‌న్ ఏర్ప‌డింద‌ని పాండిరాజ్ తెలిపాడు. త‌న గురించి, పుష్ప గురించి పాండిరాజ్ ఇలా మాట్లాడ్డం గొప్ప‌గా అనిపించింద‌ని, అందులో ఆస‌క్తిక‌ర‌మైన స్క్రీన్ ప్లే ఉంద‌ని ఓ ఇంట‌ర్వ్యూలో సుకుమార్ చెప్ప‌డం విశేషం.