RRR వాయిదా.. అంత వీజీ కాదు

ఇప్ప‌టికే మూడుసార్లు వాయిదా పడింది ఆర్ఆర్ఆర్ సినిమా. తొలిసారి వాయిదా వేయ‌డానికి చిత్ర బృందం ఆల‌స్య‌మే కార‌ణం. కానీ త‌ర్వాతి రెండుసార్లూ క‌రోనా కార‌ణంగానే సినిమా వాయిదా ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. ఐతే అన్ని అడ్డంకుల‌నూ దాటి ఎట్ట‌కేల‌కు 2022 జ‌న‌వ‌రి 7న ఆర్ఆర్ఆర్ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంద‌ని ఆ సినిమా కోసం ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్న కోట్లాది మంది ప్రేక్ష‌కులు ఎంతో సంతోషంగా ఉన్నారు.

కానీ ఇప్పుడు మ‌ళ్లీ క‌రోనా సినిమాలను దెబ్బ కొట్టేలా క‌నిపిస్తోంది. ఢిల్లీలో థియేట‌ర్లు మూసేయ‌డం.. ఉత్త‌రాదిన మ‌రికొన్ని రాష్ట్రాలు కూడా ఈ బాట ప‌ట్టే సూచ‌న‌లు క‌నిపిస్తుండ‌టంతో ఇప్ప‌టికే జెర్సీ మూవీని వాయిదా వేశారు. ఇక త‌ర్వాతి వంతు ఆర్ఆర్ఆర్‌దే అన్న ఊహాగానాలు మొద‌లైపోయాయి. కానీ ఈ ద‌శ‌లో ఈ చిత్రాన్ని వాయిదా వేయ‌డం క‌ష్ట‌మే అని తెలుస్తోంది.

ఆర్ఆర్ఆర్ మూవీకి నెల రోజుల నుంచి ఉద్దృతంగా ప్ర‌మోష‌న్లు చేస్తున్నారు. చాలా ఖ‌ర్చు పెట్టి ఈవెంట్లు చేశారు. ద‌ర్శ‌కుడు రాజ‌మౌళితో పాటు హీరోలు జూనియ‌ర్ ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ఇందుకోసం చాలా క‌ష్ట‌ప‌డ్డారు. మ‌రోవైపు ఇండియాలోనే కాక వ‌ర‌ల్డ్ వైడ్ థియేట‌ర్లతో ఒప్పందాలు జ‌రిగిపోయాయి. ఓవ‌ర్సీస్‌లో ప‌ది రోజుల కింద‌ట్నుంచే టికెట్లు అమ్ముతున్నారు. పెద్ద ఎత్తున టికెట్లు అమ్ముడ‌య్యాయి కూడా. ఇంతా జ‌రిగాక ఇప్పుడు సినిమా వాయిదా అంటే అక్క‌డ తీవ్ర గంద‌ర‌గోళ ప‌రిస్థితులు త‌లెత్తుతాయి. ఇండియాలో అయినా కూడా ఇబ్బందే.

ఈ అనిశ్చితి ఎన్ని రోజులు కొన‌సాగుతుందో తెలియ‌దు. ఎంతో క‌ష్ట‌ప‌డి పోటీగా ఉన్న సినిమాల‌ను త‌ప్పించి, విమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొని సినిమాను విడుద‌ల‌కు సిద్ధం చేశాక‌, ప్ర‌మోష‌న్లు స‌హా అన్ని విష‌యాల్లో ఎంతో క‌ష్ట‌ప‌డ్డాక ఇప్పుడు వాయిదా అంటే ఎంత క‌ష్ట‌మో అంచ‌నా వేయొచ్చు. ఇక కొత్త రిలీజ్ డేట్ ఎంచుకోవ‌డంలోనూ చాలా ఇబ్బందులున్నాయి. వాయిదా వ‌ల్ల వ‌డ్డీల భార‌మూ పెరుగుతుంది. కాబ‌ట్టి కొన్ని ఏరియాల్లో వ‌సూళ్ల ప‌రంగా కొంత కోత ప‌డ్డా ప‌ర్వాలేద‌ని జ‌న‌వ‌రి 7న రిలీజ్‌కు వెళ్లిపోయే ఆలోచ‌న‌తోనే చిత్ర బృందం ఉంద‌ట‌. మ‌రీ ప‌రిస్థితి విష‌మిస్తే త‌ప్ప ఈ చిత్రాన్ని వాయిదా వేయ‌డం డౌటే అంటున్నారు.