ఆర్ఆర్ఆర్.. నైజాం లెక్క అదీ

‘అఖండ’ కథ ముగింపు దశకు వచ్చింది. ‘పుష్ప’ కథ కూడా త్వరలోనే ముగియబోతోంది. ఇండియాలో మిగతా భాషల చిత్రాల గురించి కూడా చర్చలు ఇంకో వారం రోజులే. అన్ని పరిశ్రమల్లో, అన్ని సినిమాల థియేట్రికల్ రన్ పది రోజుల్లోపే. ఆ తర్వాత ఆధిపత్యమంతా ‘ఆర్ఆర్ఆర్’దే. దేశవ్యాప్తంగా ఈ చిత్రం కనీవినీ ఎరుగని రీతిలో విడుదల కాబోతోంది. ‘బాహుబలి’కి ఏమాత్రం తగ్గని విధంగా, ఇంకా చెప్పాలంటే దాన్ని మించి భారీ రిలీజ్ ప్రణాళికలతో సిద్ధమవుతోంది చిత్ర బృందం.

తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే మోత మామూలుగా ఉండేలా లేదు. ఏపీలో టికెట్ల రేట్లు, అదనపు షోల విషయంలో సందిగ్ధత నడుస్తోంది. ఆ విషయంలో ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి. అంతకంటే ముందే ‘ఆర్ఆర్ఆర్’ తెలంగాణ లెక్కలు దాదాపుగా తేలిపోయినట్లే కనిపిస్తోంది. ఈ ప్రాంతంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా రిలీజ్ ప్లాన్స్ మామూలుగా లేవని సమాచారం. తెలంగాణ వ్యాప్తంగా నూటికి నూరు శాతం థియేటర్లలో ‘ఆర్ఆర్ఆర్’నే ప్రదర్శించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలిసింది.

ప్రస్తుతం థియేటర్లలో ఉన్న అఖండ, పుష్ప, 83, శ్యామ్ సింగరాయ్.. ఈ వారం విడుదలయ్యే జెర్సీ (హిందీ), అర్జున ఫల్గుణ.. ఇలా అన్ని సినిమాలకూ జనవరి ఆరో తేదీనే చివరి రోజట. తర్వాతి రోజు నుంచి వేరే చిత్రాలు ఏవీ దాదాపుగా ఆడే అవకాశాలు లేనట్లే. ప్రతి సింగిల్ స్క్రీన్లో, అలాగే మల్టీప్లెక్సుల్లోని అన్ని తెరల్లో ‘ఆర్ఆర్ఆర్’నే ఆడించబోతున్నారట.

ఈ చిత్రానికి సింగిల్ స్క్రీన్లలో రోజుకు ఐదు షోలు వేయడానికి అనుమతులు దాదాపు వచ్చినట్లే అంటున్నారు. మల్టీప్లెక్సుల్లోనూ ప్రతి స్క్రీన్లో ఐదు చొప్పున షోలు నడిపించబోతున్నారట. ‘పుష్ప’కు లాగే దీనికి కూడా తొలి వారం టికెట్ కనీస ధర సింగిల్ స్క్రీన్లలో  రూ.200, మల్టీప్లెక్సుల్లో రూ.250 ఉండబోతోందట. ఈ రేట్లతో అందుబాటులో ఉన్న ప్రతి స్క్రీన్లో ఐదు షోల చొప్పున ‘ఆర్ఆర్ఆర్’ను నడిపిస్తే వసూళ్లు కనీ వినీ ఎరుగని స్థాయిలో ఉంటాయని ప్రత్యేకంగా చెప్పేదేముంది?