దర్శకుడి మీద ఎంత గురి ఉన్నా సరే.. కథ వినకుండా సినిమా చేయడం అంటే కష్టమే. పెద్ద పెద్ద దర్శకులతో సినిమా చేస్తున్నా సరే.. హీరోలు లాంఛనానికి అయినా ఒకసారి కథ వింటారు. కానీ చాలా కొద్ది మంది దర్శకుల మీద మాత్రం హీరోలకు అపరిమితమైన నమ్మకం ఉంటుంది. స్క్రిప్టు ఊసెత్తకుండా సినిమాలు చేసేస్తారు. రామ్ చరణ్ అలా సినిమాలు చేసే దర్శకులు ఇద్దరు మాత్రమేనట.
అందులో ఒకరు తనతో ఇంతకుముందు ‘మగధీర’ లాంటి ఇండస్ట్రీ తీసి, ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ లాంటి మెగా మూవీని తెరకెక్కించిన రాజమౌళి అట. మరొకరు చరణ్‌కు ‘రంగస్థలం’ లాంటి మరపురాని చిత్రాన్ని అందించిన సుకుమార్ అట. ఓ ఇంటర్వ్యూలో భాగంగా ‘ఆర్ఆర్ఆర్’ కథ వినకుండానే ఈ సినిమా చేశారట కదా అని అడిగితే.. అది నిజమే అని చరణ్ తెలిపాడు.
తాను కథ వినకుండా సినిమాలు చేసే దర్శకులు ఇద్దరే అని.. అందులో ఒకరు రాజమౌళి అయితే.. మరొకరు సుకుమార్ అని వెల్లడించాడు మెగా పవర్ స్టార్. రాజమౌళి తనతో చేసిన రెండు సినిమాలకూ కథ వినలేదని.. అలాగే ‘రంగస్థలం’ సినిమాకు సుకుమార్ దగ్గరా కథ వినలేదని.. ఇకముందు కూడా వీళ్లిద్దరూ కథ చెప్పకపోయినా సినిమా చేస్తానని చరణ్ తెలిపాడు.
మీ మీద హీరోలకు ఇంత నమ్మకమా.. మీరు ఏం చెప్పినా హీరోలు చేస్తారా అని రాజమౌళిని అడిగితే.. తన మీద హీరోలకు ఉన్న నమ్మకానికి సంతోషమే అని.. కానీ ఏం చెప్పినా ఓకే చేస్తారు.. తన సినిమాలో ఎవరైనా నటిస్తారు అనే భావన తనకు వస్తే అది తన పతనానికి నాంది అవుతుందని రాజమౌళి చెప్పాడు. తనతో ఎవరు పని చేసినా తాను కోరుకున్న ఔట్ పుట్ వచ్చే వరకు రాజీ పడననేది వాస్తవమే అని.. ఎవరు తక్కువ చేసినా తాను ఊహించుకున్నట్లుగా సన్నివేశం రాదేమో అన్న భయం తనను వెంటాడుతుందని.. అందుకే కఠినంగా ఉంటానని జక్కన్న తెలిపాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates