నాని మాట్లాడిన గంట‌ల్లోనే..

ఆంధ్రప్ర‌దేశ్‌లో టికెట్ల రేట్లపై నియంత్ర‌ణ‌తో టాలీవుడ్ తీవ్ర ఇబ్బందిక‌ర ప‌రిస్థితులే ఎదుర్కొంటోంది. అస‌లే క‌రోనాతో సినీ ప‌రిశ్ర‌మ కుదేలైంది. థియేట‌ర్ల వ్య‌వ‌స్థ దారుణంగా దెబ్బ తింది. పైగా ఇప్పుడు మేజ‌ర్ క‌లెక్ష‌న్లు వ‌చ్చే ఏరియాల్లో ఇలా రేట్లు త‌గ్గించేస్తే థియేట‌ర్ల మ‌నుగ‌డ ఎలా.. ఇండ‌స్ట్రీ కోలుకునేదెలా అన్న ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. దీని వ‌ల్ల అంద‌రికీ ఇబ్బందులు త‌ప్ప‌ట్లేదు. కానీ గ‌ట్టిగా స‌మ‌స్య మీద మాట్లాడ‌టానికి చాలామందికి ధైర్యం స‌రిపోవ‌డం లేదు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌హా కొంద‌రు గ‌ళం విప్పినా ఫ‌లితం లేక‌పోయింది. ప్ర‌భుత్వం మ‌రింత మొండిగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇలాంటి టైంలోనే నేచుర‌ల్ స్టార్ నాని ఈ స‌మ‌స్య మీద గ‌ట్టిగా మాట్లాడాడు. ప్ర‌భుత్వ తీరును త‌ప్పుబ‌ట్టాడు. ఏపీలో టికెట్ల రేట్ల విష‌యంలో జ‌రుగుతున్న‌ది క‌రెక్ట్ కాద‌న్నాడు. రేట్ల గురించి ప్ర‌స్తావిస్తూ థియేట‌ర్ల‌లో కౌంట‌ర్ల కంటే కిరాణా కొట్టు కౌంట‌ర్ల ప‌రిస్థితే బాగుంద‌న్నాడు. చాలామంది నాని ధైర్యానికి మెచ్చి శ‌భాష్ అన్నారు.

శోభు యార్ల‌గ‌డ్డ‌, దేవా క‌ట్టా లాంటి కొంద‌రు కొంద‌రు సినీ ప్ర‌ముఖులు కూడా అత‌డికి మ‌ద్ద‌తు ఇచ్చారు. కానీ ఈ వ్యాఖ్య‌ల ప్ర‌భావాన్ని నాని వెంట‌నే ఎదుర్కొంటున్నాడు. ఇప్ప‌టికే ఏపీలో థియేట‌ర్ల మీద దాడులు చేయిస్తున్న ఏపీ స‌ర్కారు దూకుడు మ‌రింత పెంచింది. నాని ఇలా మాట్లాడిన కొన్ని గంట‌ల్లోనే థియేట‌ర్ల మీద మ‌రింత ఉద్ధృతంగా దాడులు చేశారు. ఏపీలో వివిధ జిల్లాల్లో అధికారులు థియేట‌ర్లు ఏమేర నిబంధ‌న‌లు పాటిస్తున్నాయో ప‌రిశీలించారు. లైసెన్సులు చెక్ చేశారు.

నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తున్న థియేట‌ర్ల‌ను సీజ్ చేసి ప‌డేశారు. చిత్తూరు జిల్లా మ‌ద‌న ప‌ల్లిలో ఒకేసారి ఏడు థియేట‌ర్ల‌ను సీజ్ చేయ‌డం గ‌మ‌నార్హం. కృష్ణాజిల్లాలో కూడా పెద్ద ఎత్తున థియేట‌ర్ల‌కు పంచ్ ప‌డిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి. వీటిలో చాలా వ‌ర‌కు నాని సినిమా శ్యామ్ సింఘ‌రాయ్‌ను ప్ర‌ద‌ర్శించ‌బోతున్న థియేట‌ర్లుండ‌టం గ‌మ‌నార్హం. నాని మాట‌ల‌కు ఏపీ స‌ర్కారు ఇలా స్పందించాక ఇక ముందు ఈ విష‌యం మీద మాట్లాడ‌టానికి ఇంకెవరైనా సాహ‌సిస్తారా?