ఆర్ఆర్ఆర్ షూటింగ్ మొద‌లైన రెండో రోజే..


అన్న‌ప్రాస‌న రోజే ఆవ‌కాయ అనే సామెత సంగ‌తి తెలిసిందే. ఏదైనా ప‌ని మొద‌లుపెట్టిన‌పుడు ఆరంభంలోనే మోతాదు ఎక్కువైతే ఈ సామెత వాడుతుంటాం. ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్‌లోనూ ఇదే జ‌రిగింద‌ట‌. మామూలుగా ఒక సినిమా షూటింగ్ ఆరంభం అయిన‌పుడు తొలి వారం రోజుల్లో ఎక్కువ క‌ష్ట‌ప‌డాల్సిన అవ‌స‌రం లేని చిన్న చిన్న స‌న్నివేశాలు తీస్తుంటారు. త‌మ పాత్ర‌ల‌కు కాస్త‌ అల‌వాటు ప‌డ్డాక ఇంటెన్సిటీ పెంచి పెద్ద స్థాయి స‌న్నివేశాలు తెర‌కెక్కిస్తారు.

ఐతే రాజ‌మౌళి దీనికి భిన్నంగా ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఆరంభ‌మైన రెండో రోజే హీరోల‌తో భారీ విన్యాసాలు చేయించాడ‌ట‌. జూనియ‌ర్ ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌ల‌కు తాడు క‌ట్టి 60 అడుగుల ఎత్తులోకి పంపించాడ‌ట‌. ఒక భారీ యాక్ష‌న్ సీక్వెన్స్ కోస‌మే ఇదంతా చేయించాడ‌ట‌.

ఆర్ఆర్ఆర్ హిందీ వెర్ష‌న్ ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా ఒక కార్య‌క్ర‌మంలో దీని గురించి రాజ‌మౌళి, తార‌క్, చ‌ర‌ణ్ మాట్లాడారు. మామూలుగా షూటింగ్ ఆరంభంలో చిన్న చిన్న స‌న్నివేశాలు తీయ‌డం ఆన‌వాయితీ అని, కానీ ఈ సినిమాకు మాత్రం త‌న హీరోల‌తో సాహ‌సోపేత విన్యాసాలు చేయించానని స్వ‌యంగా రాజ‌మౌళే వెల్ల‌డించాడు. ఇద్ద‌రికీ తాళ్లు క‌ట్టించి 60 అడుగుల ఎత్తుకు పంపించిన‌ట్లు చెప్పాడు.

ఇంత‌లో తార‌క్ అందుకుని రెండో రోజు ఈ స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తే.. తొలి రోజేమీ త‌మ‌ను ఖాళీగా ఉంచ‌లేద‌ని.. ఈ స‌న్నివేశాల కోసం రాజ‌మౌళి రిహార్స‌ల్స్ చేయించాడ‌ని తెలిపాడు. తాను తాడు క‌ట్టుకుని 60 అడుగుల ఎత్తులో ఉండ‌గా.. ప‌ది నిమిషాలు లేటుగా సెట్‌కు వ‌చ్చిన చ‌ర‌ణ్ త‌న‌ను చూసి ఆశ్చ‌ర్య‌పోయాడ‌ని అన్నాడు. ఈ స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ త‌ర్వాత త‌మ ఇద్ద‌రికీ బ‌రువులు క‌ట్టి 20 అడుగుల నీటి లోతులోకి పంపించార‌ని.. చ‌ర‌ణ్‌కు ఇలాంటివి అల‌వాటే కానీ.. త‌న‌కు కాద‌ని, దీంతో ఇబ్బంది ప‌డ్డాన‌ని తార‌క్ వెల్ల‌డించాడు.