దేశంలో మిగతా రాష్ట్రాలన్నింటిదీ ఒక దారైతే.. ఆంధ్రప్రదేశ్‌ది ఒక దారిలా ఉంది. రాష్ట్రంలో ఇంకే సమస్యలూ లేనట్లు సినిమా టికెట్ల మీద ఎక్కడ లేని శ్రద్ధ పెడుతోంది ప్రభుత్వం. జనాల మంచి కోసమని టికెట్ల రేట్లు తగ్గిస్తున్నామంటూ పదేళ్ల కిందటి జీవోను తీసుకొచ్చి పట్టుబట్టి ధరలను నియంత్రిస్తుండటం అందరికీ విడ్డూరంగా అనిపిస్తోంది. టికెట్ల రేట్లను తగ్గించి జనాలకు మేలు చేస్తున్నామని మంత్రులు పదే పదే మీడియా ముందుకొచ్చి చెబుతున్నారు.
కానీ ఇదే ఆలోచన నిత్యావసరాల విషయంలోనూ చేయొచ్చు కదా.. మిగతా అన్ని వస్తువుల విషయంలోనూ విపరీతంగా పన్నులేసి జనాల నడ్డి విరుస్తూ కేవలం సినీ పరిశ్రమను గుప్పెట్లో పెట్టుకోవాలనో, పవన్ కళ్యాణ్‌ను ఇరుకున పెట్టాలనో ఇలా సినిమా టికెట్ల రేట్ల మీద పడటం ఏంటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోనీ ప్రభుత్వం తెచ్చిన జీవోతో నిజంగా జనాలకు మేలు జరుగుతోందా అంటే అదీ లేదు.ఏపీలో విపరీతంగా బ్లాక్టికెట్ల దందా నడుస్తోంది. థియేటర్లలో పని చేసేవాళ్లు.. కొన్ని చోట్ల యాజమాన్యాలే బ్లాక్ టికెట్ల దందాను నడిపిస్తున్నాయి. దీని వల్ల మధ్యలో ఉన్న వ్యక్తులు డబ్బులు చేసుకుంటున్నారు తప్ప అది డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు చేరట్లేదు. న్యాయంగా థియేటర్లు నడపాలనుకుంటున్న వాళ్లకు అస్సలు గిట్టుబాటు కావడం లేదు.
దీంతో తప్పక థియేటర్లను మూసుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. విజయవాడ శివారల్లో నగర పంచాయితీ అయిన కంకిపాడుతో టికెట్ల ధరలు వరుసగా 20, 15, 10గా ఉన్నాయి. సిటీలో మధ్యలో ఉన్న థియేటర్‌కైనా, ఈ థియేటర్‌కైనా అయ్యే మెయింటైనెన్స్ ఖర్చు సమానం. నగర పంచాయితీ అయినా, మున్సిపాలిటీలోని థియేటర్ అయినా అధునాతన హంగులన్నీ ఉండి, మంచి క్వాలిటీతో సినిమా చూపిస్తే తప్ప జనాలు థియేటర్లకు రావట్లేదు. లక్షలు కోట్లు ఖర్చు పెట్టి థియేటర్‌ను అధునాతంగా తీర్చిదిద్ది ఇలాంటి రేట్లతో టికెట్లు అమ్మి మనుగడ సాధించడం అసాధ్యం. వంద రూపాయలు పెట్టి టికెట్ కొని చూడటానికి జనాలకే అభ్యంతరం లేదు.
ప్రభుత్వం వాళ్లకు మేలు చేయాలనుకుంటే.. నిర్దేశిత ధరలు పెట్టాక తొలి వారం రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వకుండా చూడొచ్చు. బ్లాక్ టికెట్ల దందాపై ఉక్కు పాదం మోపచ్చు. అంతే కానీ.. 10, 20, 30, 40, 50 రూపాయలతో టికెట్లు అమ్ముకుని బతకమంటే అది కచ్చితంగా అన్యాయమే అవుతుంది. అసలు ఈ రేట్లతో దేశంలో ఎక్కడైనా థియేటర్లు నడుస్తున్నాయా అన్నది పరిశీలించి తర్వాత మంత్రులు మాట్లాడాలి. నిత్యావసరం అయిన పెట్రోలు మీద విపరీతంగా పన్నులేసి దేశంలోనే అత్యధిక ధరకు అమ్ముతున్న రాష్ట్రాల్లో ఒకటిగా రికార్డులు నెలకొల్పుతూ.. నిత్యావసరం కాని, ప్రేక్షకుడి ఇష్టం మేరకు చూసే సినిమాలకు మాత్రం ఇంత తక్కువ రేట్లతో టికెట్లు అమ్మాలని ప్రభుత్వం ఆదేశాలివ్వడం విడ్డూరం.