కృష్ణంరాజును చూసి ప్ర‌భాస్ అభిమానుల భ‌యం


బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ చేసిన సాహో సినిమా డిజాస్ట‌ర్ అయిన‌ప్ప‌టికీ.. ఆ సినిమాకు రిలీజ్ ముంగిట వ‌చ్చిన హైప్ అలాంటిలాంటిది కాదు. అందుక్కార‌ణం అది ప‌క్కా యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ లాగా క‌నిపించ‌డ‌మే. ఆ సినిమాకు అంతిమంగా ఆశించిన ఫ‌లితం రాకున్నా.. ప్రి రిలీజ్ హైప్, బుకింగ్స్, ఓపెనింగ్స్ విష‌యంలో తిరుగులేదు. అలాంటి యుఫోరియా ఇప్పుడు ప్ర‌భాస్ కొత్త సినిమా రాధేశ్యామ్ విషయంలో క‌నిపించ‌డం లేదు. అందుకు ప్ర‌ధాన కార‌ణం ఇది ల‌వ్ స్టోరీ కావ‌డం, మాస్, యాక్ష‌న్ అంశాలు లేక‌పోవ‌డం.

ఇంకా కొన్ని కార‌ణాల వ‌ల్ల కూడా ఈ సినిమాకు ఆశించినంత బ‌జ్ రాలేదు. ఇదొక ట్రాజిక్ ల‌వ్ స్టోరీ అన్న సంకేతాలు క‌నిపిస్తుండ‌టంతో ప్ర‌భాస్ అభిమానులు కొంచెం టెన్ష‌న్ ప‌డుతున్న మాట వాస్త‌వం. ఇలాంటి టైంలో ఇప్పుడీ చిత్రం నుంచి కృష్ణం రాజు లుక్ రిలీజ్ చేయ‌డంతో చాలామంది నెగెటివ్‌గానే స్పందిస్తున్నారు.

ప్ర‌భాస్ అభిమానులైతే సినిమా విష‌యంలో మ‌రింత టెన్ష‌న్ ప‌డిపోతున్నారు కృష్ణంరాజు లుక్ చూసి. త‌న పెద‌నాన్న‌తో ప్ర‌భాస్ క‌లిసి చేసిన ప్ర‌తిసారీ చేదు అనుభ‌వాలే ఎదురు కావ‌డ‌మే ఇందుకు కార‌ణం. తొలిసారి వీళ్లిద్ద‌రూ క‌లిసి బిల్లాలో న‌టించారు. అందులో కృష్ణంరాజు క్యారెక్ట‌ర్ కామెడీ అయిపోయింది. సినిమాకు ఆశించిన ఫలితం రాలేదు. ఆ త‌ర్వాత రెబ‌ల్ కోసం ఇద్ద‌రూ జ‌ట్టు క‌డితే ఫలిత‌మేంటో తెలిసిందే. అందులోనూ కృష్ణంరాజు పాత్ర పండ‌లేదు.

గ‌త రెండు ద‌శాబ్దాల్లో కృష్ణం రాజు న‌టించిన ఏ సినిమా కూడా పెద్ద స‌క్సెస్ అయింది లేదు. ఆయ‌న్నో నెగెటివ్ సెంటిమెంటుగా భావిస్తున్నారు. పైగా రాధేశ్యామ్‌లో ఆయ‌న లుక్ మ‌రింత ఆందోళ‌న రేకెత్తిస్తోంది. ఈ త‌ర‌హా పాత్ర కృష్ణంరాజుకు ఏమాత్రం సెట్ అవుతుందో.. సినిమాకు ఈ పాత్ర ఏమేర ఉప‌యోగ‌ప‌డుతుందో అన్న భ‌యాలు క‌లుగుతున్నాయి. మ‌రి ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ‌కుమార్ కృష్ణంరాజు విష‌యంలో నెల‌కొన్న నెగెటివ్ సెంటిమెంట్ల‌ను చెరిపేస్తాడేమో చూడాలి.