స్పైడర్ మ్యాన్.. స్పైడర్ మ్యాన్.. వారం నుంచి ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియుల చర్చలన్నీ ఈ సినిమా చుట్టూనే తిరుగుతున్నాయి. కరోనా తర్వాత అత్యధిక అంచనాలతో విడుదలైన హాలీవుడ్ మూవీ ఇదే. మధ్యలో టెనెట్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సహా కొన్ని పెద్ద సినిమాలు రిలీజైనా సరే.. వాటికి స్పైడర్ మ్యాన్ తరహాలో క్రేజ్ రాలేదు. పిల్లల్లో స్పైడర్ మ్యాన్‌కు ఉన్న ఫాలోయింగే వేరు.
వాళ్లతో పాటు ఫ్యామిలీస్ కూడా స్పైడర్ మ్యాన్ కోసం థియేటర్లకు పరుగులు పెట్టాల్సిందే. స్పైడర్ మ్యాన్: నో వే హోమ్ పేరుతో భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ మార్వెల్ సినిమా అంచనాలకు ఏమాత్రం తగ్గని విధంగా ఉండటంతో ప్రపంచ వ్యాప్తంగా వసూళ్ల మోత మోగిపోయింది. ఇండియాలో పుష్ప లాంటి భారీ చిత్రం పోటీని తట్టుకుని ఈ సినిమా సాగించిన ప్రభంజనం చర్చనీయాంశం అయింది.
తొలి రోజే 36 కోట్ల నెట్ వసూళ్లు సాధించి.. వీకెండ్ మొత్తం జోరు కొనసాగించిన ఈ చిత్రం.. వంద కోట్ల గ్రాస్ వసూళ్లకు చేరువగా ఉండటం విశేషం. ఇక ప్రపంచ స్థాయిలో స్పైడర్ మ్యాన్ వసూళ్ల లెక్కలు చూసి ట్రేడ్ పండిట్లకు కళ్లు చెదిరిపోతున్నాయి. కేవలం అమెరికాలో మాత్రమే ఈ చిత్రం వీకెండ్లో 253 మిలియన్ డాలర్లు వసూలు చేయడం విశేషం. అంటే మన రూపాయల్లో 1900 కోట్ల పైమాటే అన్నమాట. ఇక మిగతా ప్రపంచ దేశాలన్నింట్లో కలిపి ఈ చిత్రం తొలి వారాంతంలో 336 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.2550 కోట్లు) కొల్లగొట్టింది.
కేవలం వీకెండ్లోనే ఈ చిత్రం మొత్తంగా 4500 కోట్లకు చేరువగా వసూళ్లు రాబట్టింది. ఫుల్ రన్లో ఈ చిత్రం పది వేల కోట్ల మార్కును అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. కరోనా తర్వాత వరల్డ్ వైడ్ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం ఇదే అవుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలోనే 150 కోట్లకు అటు ఇటుగా వసూళ్లు రాబడుతుందని అంచనా వేస్తున్నారు.