బ్లాక్‌బ‌స్ట‌ర్ సీక్వెల్ క‌న్ఫ‌మ్

కొన్నేళ్ల నుంచి అర్థం ప‌ర్థం లేని మాస్ మ‌సాలా సినిమాలే చేస్తూ వ‌స్తున్నాడు స‌ల్మాన్ ఖాన్. వాటికి ఓపెనింగ్స్ బాగానే వ‌స్తుండొచ్చు కానీ.. ఇలాంటి  సినిమాలు చేయ‌డం వ‌ల్ల ఇమేజ్ దెబ్బ తిని, క్ర‌మంగా మార్కెట్ కూడా ప‌డిపోతుంది. ఈ మ‌ధ్య వ‌చ్చిన అంతిమ్ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర తుస్సుమ‌నిపించ‌డానికి అదే కార‌ణం. ఐతే స‌ల్మాన్‌కు అస్స‌లు టేస్టే లేదా.. అత‌ను మంచి సినిమాలు చేయ‌డా అంటే అదేమీ కాదు.

కొన్నేళ్ల ముందు అత‌ను భ‌జ‌రంగి భాయిజాన్, సుల్తాన్ లాంటి మంచి చిత్రాల్లో న‌టించాడు. ముఖ్యంగా భ‌జ‌రంగి భాయిజాన్‌తో స‌ల్మాన్ అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను క‌దిలించేశాడు. స‌ల్మాన్ కెరీర్లోనే అత్యుత్త‌మ చిత్రాల్లో ఒక‌టిగా దీన్ని చెప్పొచ్చు. ఆ సినిమాకు క‌థ అందించింది రాజ‌మౌళి తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాద్  కావ‌డం విశేషం. తెలుగులో బ్లాక్‌బ‌స్ట‌ర్ అయిన ప‌సివాడి ప్రాణం స్ఫూర్తితో ఆయ‌నా క‌థ రాశారు. క‌బీర్ కాని క‌థ‌లోని ఆత్మ‌ను ప‌ట్టుకుని హృద్యంగా ఆ చిత్రాన్ని తెర‌కెక్కించాడు.

బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఆ సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ అయింది కూడా. ఐతే ఈ చిత్రానికి సీక్వెల్ రావొచ్చ‌ని కొంత కాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. విజ‌యేంద్ర ప్ర‌సాద్ కూడా ఈ దిశ‌గా సంకేతాలు ఇచ్చాడు. ఇప్పుడా విష‌యం అధికారిక‌మైంది. స్వ‌యంగా స‌ల్మాన్ ఖానే భ‌జ‌రంగి భాయిజాన్ సీక్వెల్ గురించి ప్ర‌క‌ట‌న చేశాడు. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీకి సంబంధించి ముంబ‌యిలో ఆదివారం నిర్వహించిన ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్‌కు స‌ల్మాన్ ముఖ్య అతిథిగా వ‌చ్చాడు.

ఈ సంద‌ర్భంగా అత‌ను మాట్లాడుతూ.. రాజ‌మౌళి తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాద్ త‌న కోసం భ‌జ‌రంగి భాయిజాన్ సీక్వెల్ స్క్రిప్టు రాశారని.. తాను ఆ చిత్రంలో త్వ‌ర‌లోనే న‌టించ‌బోతున్నాన‌ని వెల్ల‌డించాడు. ఐతే క‌బీర్ ఖానే ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తాడా లేదా అన్న‌ది చెప్ప‌లేదు. ఇదిలా ఉండ‌గా.. ఆర్ఆర్ఆర్ సినిమా వ‌చ్చాక నాలుగు నెల‌ల పాటు సినిమాలేవీ రిలీజ్ చేయ‌కూడ‌ద‌ని స‌ల్మాన్ పెద్ద స్టేట్మెంట్ ఇవ్వ‌డం విశేషం.