పుష్ప.. అసలు సినిమా ముందుంది

ఈ శుక్రవారం భారీ అంచనాల మధ్య వచ్చిన ‘పుష్ప’ ఆ అంచనాలను అందుకోలేకపోయింది. సుకుమార్, అల్లు అర్జున్ సహా టీం అంతా ఎంతో కష్టపడి ఈ సినిమాను తీర్చిదిద్దిన విషయం తెర మీద కనిపించింది. సినిమాలో హై మూమెంట్స్ లేకుండా ఏమీ లేదు. కానీ ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలను మాత్రం ఈ చిత్రం అందుకోలేకపోయింది. ముఖ్యంగా ద్వితీయార్దం విషయంలో ప్రేక్షకుల నుంచి చాలా కంప్లైట్సే వచ్చాయి. ప్రథమార్ధంలో సినిమాను ఆ స్థాయిలో లేపి.. తర్వాత కింద పడేశారన్నది ప్రధానంగా వినిపిస్తున్న ఫిర్యాదు.

విలన్ల పాత్రలకు సరైన జస్టిఫికేషన్ ఇవ్వలేదని.. ఏ పాత్రలోనూ ఉండాల్సినంత బలం లేదని.. చివరి ఇరవై నిమిషాల ముందు ప్రవేశించిన ఫాహద్ ఫాజిల్‌ పాత్రను కూడా సరిగా ఎలివేట్ చేయలేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఐతే కంప్లైంట్స్‌పై దర్శకుడు సుకుమార్ స్పందించాడు. ప్రేక్షకుల్లో ఈ భావన కలగడానికి కారణం వివరించాడు.

‘పుష్ప’ సినిమాను ముందు ఒక పార్ట్‌గానే తీయాలనుకున్నారు. కానీ తర్వాత మధ్యలో ఆలోచన మారింది. రెండు భాగాలైంది. దీంతో ఫాహద్ ఫాజిల్‌తో హీరో ఢీ అంటే ఢీ అని తలపడే సీన్లన్నీ సెకండ్ పార్ట్‌కు వెళ్లిపోయాయి. అలాగే మిగతా విలన్ పాత్రలు అతడికి సవాళ్లు విసిరే సీన్స్ కూడా అందులోకే మళ్లించారు. హీరో వల్ల దెబ్బ తిని చల్లబడే దగ్గరే ఆ పాత్రలను ఆపేశారు. దీని వల్ల ఫస్ట్ పార్ట్‌లో విలన్లకు ఎలివేషన్ లేకపోయింది. ఎప్పుడైనా సరే.. విలన్ పాత్రలు బలంగా ఉండి, హీరోకు సవాలు విసిరితేనే హీరో పాత్ర ఎలివేట్ అవుతుంది. ఐతే సెకండ్ పార్ట్‌కు వీటిని మళ్లించడంతో ఫస్ట్ పార్ట్‌లో బిగి సడలినట్లు అనిపించింది.

సుకుమార్ దీని గురించి మాట్లాడుతూ.. “పుష్ప అసలు కథ సెకండ్ పార్ట్‌లోనే ఉంటుంది. ఈ సినిమా థీమ్ ఏంటన్నది అందులోనే చూపిస్తాం. ఫస్ట్ పార్ట్‌లో ఉన్న పాత్రలన్నీ అందులో కొనసాగుతాయి. అవి మరింత బలంగా ఉంటాయి. కొత్తగా ఇంకో మూడు పాత్రలు కూడా యాడ్ అవుతాయి. పుష్ప-2 చూశాక ఈ కథకు జస్టిఫికేషన్ కనిపిస్తుంది” అని వివరించాడు. కాబట్టి ‘పుష్ప-1’ చూసి ముందే ఒక అంచనాకు రాకుండా సెకండ్ పార్ట్‌ వరకు ప్రేక్షకులు ఎదురు చూడాలన్నమాట.