ఇంకొన్ని గంటల్లోనే ‘పుష్ప’ థియేటర్లలోకి దిగుతోంది. అల్లు అర్జున్, సుకుమార్‌ల నుంచి వస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ ఇది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకు తెలుగు తర్వాత ఎక్కువ క్రేజ్ ఉన్నది మలయాళంలోనే. కేరళలో చాలా ఏళ్ల నుంచి బన్నీకి మంచి ఫాలోయింగ్ ఉండటం.. గత కొన్నేళ్లలో అది ఇంకా పెరగడం.. ‘పుష్ప’కు అక్కడ మంచి హైప్ రావడం తెలిసిందే. గతంలో చాలా వరకు బన్నీ సినిమాలు తెలుగులో రిలీజయ్యాక.. కొన్నాళ్లకు మలయాళంలో అనువాదం అయి రిలీజయ్యేవి.
కానీ ‘పుష్ప’ను తెలుగుతో పాటే మలయాళంలోనూ రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరిగాయి. చాలా జాగ్రత్తగా డబ్బింగ్ వర్క్ కూడా చేశారు. బన్నీ కేరళకు వెళ్లి సినిమాను ప్రమోట్ చేశాడు కూడా. అక్కడ ఈ సినిమాను పెద్ద హీరోల స్ట్రెయిట్ మూవీ స్థాయిలో విడుదలకు సిద్ధం చేశారు.
తెల్లవారుజామున ఫ్యాన్స్ షోలు కూడా ప్లాన్ చేశారంటే ‘పుష్ప’కు మలయాళంలో ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అడ్వాన్స్ బుకింగ్స్ చాలా బాగా జరగడంతో అందరూ చాలా ఉత్సాహంగా ఉండగా.. ఇప్పుడు పెద్ద షాక్ తగిలింది. ‘పుష్ప’ మలయాళ వెర్షన్ శుక్రవారం విడుదల కావట్లేదు. ఒక రోజు ఆలస్యంగా శనివారం సినిమా రిలీజవుతుందని అంటున్నారు. ఈ సినిమా ఫైనల్ కాపీని సరైన సమయానికి డెలివర్ చేయడంలో చిత్ర బృందం విఫలమైంది.
తెలుగులో కాస్త ముందే సెన్సార్ చేయించి.. తర్వాత కొన్ని మార్పులు చేర్పులు చేశారు. వాటికి కూడా సెన్సార్ బోర్డు నుంచి ఆమోదం తెచ్చుకున్నారు. కానీ సుకుమార్ ముంబయిలో కూర్చుని విడుదలకు రెండు రోజుల ముందు కూడా మార్పులు చేర్పులు చేయడం.. ఆ కంటెంట్ కేరళకు ఆలస్యంగా అందడం, దానికి డబ్బింగ్ పూర్తి చేసి, సెన్సార్ పూర్తి చేయించడంలో ఆలస్యం జరగడంతో శుక్రవారం షోలన్నీ క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇంత హైప్ ఉన్న సినిమాకు తొలి రోజు షోలు పడకపోవడంతో కేరళ బన్నీ అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.