వరలక్ష్మీ శరత్‌కుమార్.. ఈ పేరు వినగానే గుర్తొచ్చేది ‘క్రాక్’ సినిమాలో జయమ్మ పాత్ర. విలన్ అయిన సముద్రఖని పక్కన ఉంటూ, అతన్ని మించిన విలనీని ప్రదర్శించే క్యారెక్టర్. దాన్ని వరలక్ష్మి పోషించిన తీరుకి అందరూ ఫిదా అయిపోయారు. అందుకే బాలకృష్ణ, గోపీచంద్ మలినేని సినిమాలో కూడా విలన్ పాత్ర వరించింది తనని. ఇప్పుడు సమంత సినిమాలో కూడా వరూకి చోటు దక్కింది.
సమంత లీడ్ రోల్‌లో శివలెకంక కృష్ణప్రసాద్ నిర్మాణంలో ‘యశోద’ అనే మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హరి, హరీష్ అనే కొత్త దర్శకులు ఈ చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమవుతున్నారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌లో మధుబాల అనే ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఒకటి ఉంది. దానికి వరలక్ష్మిని తీసుకున్నారు. ఆమె ఇవాళ సెట్‌లో జాయినయ్యింది కూడా.
ఈ విషయాన్ని టీమ్ అఫీషియల్‌గా కన్‌ఫర్మ్ చేసింది. ఈ నెల 6న షూటింగ్ స్టార్ట్ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఈ నెల 23తో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీటవుతుంది. సెకెండ్ షెడ్యూల్‌ని జనవరిలో మొదలుపెడతారు. మార్చ్ నెలకల్లా మూవీని పూర్తి చేయాలనే ప్లాన్‌తో అడుగులు వేస్తున్నారు. ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఇతర నటీనటుల వివరాలను రివీల్ చేయాల్సి ఉంది. ప్రస్తుతానికి వరలక్ష్మి గురించి మాత్రమే చెప్పారు మేకర్స్.
హుందాగా ఉండే పాత్రలకు వరలక్ష్మి పెట్టింది పేరు. విలనీని ప్రదర్శించడంలోనూ ఆమెది ప్రత్యేకమైన తీరు. పందెంకోడి, సర్కార్, తెనాలి రామకృష్ణ బీఏబీఎల్, క్రాక్ చిత్రాల్లో ఆమె నటనకి ఎవరైనా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. అలాంటి తనని తీసుకున్నారంటే కచ్చితంగా ఏదో బలమైన పాత్రే అయ్యుండాలి. అదేమిటో ఎప్పటికి రివీల్ చేస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates