తండ్రీ కొడుకుల సినిమా.. అఫీషియ‌ల్‌

Vikram Dhruv

ఒక సూప‌ర్ స్టార్ హీరో త‌న‌యుడు హీరోగా అరంగేట్రం చేశాడంటే.. ఇక అత‌ను తండ్రితో క‌లిసి ఎప్పుడు న‌టిస్తాడా అని అభిమానులు ఎదురు చూస్తారు. టాలీవుడ్ విష‌యానికి వ‌స్తే నిన్న‌టి త‌రంలో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ వాళ్ల కొడుకుల‌తో క‌లిసి న‌టించారు. త‌ర్వాతి త‌రంలో చిరంజీవి రామ్ చ‌ర‌ణ్ న‌టించిన రెండు సినిమాల్లో క్యామియో రోల్స్ చేశాడు.

ఆచార్య‌లో ఇద్ద‌రూ క‌లిసి న‌టిస్తార‌ని అంటున్నారు. ఇక నాగార్జున మ‌నం సినిమాలో త‌న కొడుకులిద్ద‌రితో క‌లిసి న‌టించాడు. ఇప్పుడు కోలీవుడ్‌లో ఓ సూప‌ర్ స్టార్ కొడుకుతో క‌లిసి న‌టించ‌బోతున్నాడు. ఆ తండ్రీ కొడుకులు.. విక్ర‌మ్, ధ్రువ్. అర్జున్ రెడ్డి రీమేక్ ఆదిత్య వ‌ర్మ‌తో ధ్రువ్ హీరోగా ప‌రిచ‌యం అయిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా ప‌ర్వాలేద‌నిపించింది. ఇంకా అత‌డి రెండో సినిమా ఖ‌రార‌వ్వ‌లేదు.

ఈ లోపే తండ్రితో క‌లిసి న‌టించే అవ‌కాశం అందుకున్నాడు ధ్రువ్. వీళ్లిద్ద‌రినీ తెర‌పై చూపించ‌బోయేది కార్తీక్ సుబ్బ‌రాజ్. అత‌ను విక్ర‌మ్‌తో ఓ సినిమా\ చేయ‌బోతున్నాడ‌ని.. ధ్రువ్ అందులో అతిథి పాత్ర చేస్తాడ‌ని కొన్ని రోజులుగా వార్త‌లొస్తున్నాయి. ఈ రోజు దానిపై అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. ఈ చిత్రానికి అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతాన్నందించ‌బోతున్నాడు. ప్ర‌స్తుతం కార్తీక్.. ధ‌నుష్ హీరోగా తీసిన జ‌గ‌మే తంత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో బిజీగా ఉన్నాడు.

థియేట‌ర్లు పునఃప్రారంభం కాగానే ఆ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకొస్తుంది. త్వ‌ర‌లోనే విక్ర‌మ్ సినిమాను మొద‌లుపెట్ట‌నున్నాడు. విక్ర‌మ్ కోబ్రా, మ‌హావీర్ క‌ర్ణ, పొన్నియ‌న్ సెల్వ‌న్ లాంటి క్రేజీ ప్రాజెక్టుల్లో న‌టిస్తున్నాడు. విక్ర‌మ్‌, ధ్రువ్ కాంబినేష‌న్లో సినిమాను ఇంత త్వ‌ర‌గా చూస్తామ‌ని అభిమానులు ఊహించి ఉండ‌రు. ప్రి లుక్ పోస్ట‌ర్‌ను బ‌ట్టి చూస్తే ఇది ప‌క్కా యాక్ష‌న్ మూవీ అని అర్థ‌మ‌వుతోంది.